Sunday 4 March 2018

పుస్తకాభిప్రాయాలు

. . . . . . . సరదా కబుర్లు
 . . . . . . . _____________
 పుస్తకాభిప్రాయాలు:_
                కొంత మంది రచయితలకు,కవులకు తమ పుస్తకాలకు పెద్దవారి చేత అభిప్రాయం రాయించుకోవాలని ఆశగా వుంటుంది!కొంతమందికి అలా రాయాలనే ఉత్సాహమూ వుంటుంది !రాయడంలో కొంతమందికి మొహమాటమూ వుంటుంది!
               ఒకాయన ఎక్కాల పుస్తకం అచ్చు వేయించాడు! దానికి అభిప్రాయం రాయమని ఓ పెద్ద మనిషిని కోరాడు. ఎక్కాల పుస్తకానికి అభిప్రాయం రాయడమేమిటంటారా! మొహమాటం! ఎందుకు రాయకూడదూ? రాశారు!!!
చూడండి!
              _____ఎక్కాలపుస్తకమనగా ఎకసెక్కము గాదు!ఎక్కములు అనగా లెక్కలకు సంబంధించినవి.లెక్కలు మన జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తున్నవో మనఅందరికీ తెలుసు.అసలు "సున్న"కనగొన్న మన దేశ వాసులకు లెక్కల గురించి తెలియకుండా వుండదు!
 . . . . . . . . . లెక్కలేని జీవితం గడిపే వారుంటారేమో గాని లెక్కలు లేకుండా జీవితం గడిపే వారుండరు!
                   ఎక్కములనగా గుణింతములే! ఒక అంకె ఎన్ని రెట్లు పెరిగితే ఎంత అవుతుందో తెలిపేవే ఎక్కములు.ఒకటో తరగతి విద్యార్థి మొదలు చదువు ముగించిన వారి వరకు ఎక్కముల అవసరం వుంటుంది! ఇరవై ఎక్కములు కంఠస్థం చేసేవారికి గుణింతములు,భాగహారములు చేయుట సులభమగును.
              ఈ విషయము తెలిసిన ముద్రాపకులు ఎక్కముల పుస్తకమును
 అందంగా ముద్రింపించి మనకు అందజేసి యున్నారు!వీరు మరిన్ని ఎక్కాల పుస్తకాలను మరిన్ని ఎక్కువ ఎక్కములతో ముద్రింపించి గణిత సేవకులలో అగ్రగణ్యులుగా నుందురు గాక! అని ఆశించుచున్నాను__ఆశీర్వదిస్తున్నాను!!

No comments:

Post a Comment