Monday 2 April 2018

హంస-కొంగ

 
       హంస,కొంగ...రెండూ పక్షి జాతికి చెందినవే! అయినా హంస హంసే!కొంగ కొంగే! దేని లక్షణం దానిదే!
       మనుషులూ అంతే కదా! అందరూ మనుషులే అయినా ఎవరి లక్షణం వారిదే!ఎవరి సంస్కారం వారిదే!
         సంస్కారాన్ని బట్టి వారి మాట తీరు,ప్రవర్తన వుంటుంది!ఎదుటి వారి మాట పట్ల స్పందన కూడా అలాగే వుంటుంది!
          కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు యీ విషయాన్ని చాలా అందంగా సున్నితంగా కొంగ-హంసల మధ్య సంభాషణగా పద్య రూపంలో చెప్పారు"
     చూడండి:
          కొంగ అడుగుతూ వుంది....హంస సమాధానం చెబుతూ వుంది

       ఎవ్వడ వీవు?కాళ్లు మొగ మెర్రన!
                                                    హంసమ!...ఎందునుందువో?
      దవ్వున మానసంబునను!  దాన విశేషములేమి చెప్పుమా?
    మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు!....నత్తలో?
    అవ్వి యెరుంగ నన్న నహహా యని నవ్వె బకంబులన్నియున్ !

            హంసను చూచిన కొంగ అడిగింది....నీవెెవరవు?కాళ్లు మొగము ఎర్రగా వున్నాయే?
             హంసను!
            ఎక్కడ వుంటావు?
           చాలా దూరంలో మానస సరోవరంలో...
          అక్కడి విశేషాలేమిటి?
         మృదువైన బంగారు పద్మాలు,ముత్యాలు ఆసరోవరంలో వుంటాయి!
         నత్తలో?(కొంగలకు నత్త గుల్లలు యిష్టమైన ఆహారం)
        అవి నాకు తెలియవు!....అనింది హంస!
     నత్తలు తెలియవా?...అని కొంగలన్నీ పరిహాసంగా నవ్వాయట!

ఎవరి దృష్టి వారిది?కొంగల సంస్కారం అంతే!
వాటికి తెలిసింది నత్తలను తినడమే!అవి తెలియని వారు వాని దృష్టిలో
అమాయకులే! బంగారు కమలాలు ముత్యాల వంటి విలువైన వాని గురించి వాటికి పట్టదు!

              మనుషులు కూడా అంతే!వారి పరిధి లోనే ఆలోచిస్తారు!
అవతలివారి విజ్ఞానము తెలివి తేటల గురించి పట్టించుకోరు!
అవతలి వారి గూర్చి తెలుసుకొనేవాడు,తెలుసుకోవాలనుకొనే వాడు
తెలివిగల వాడిక్రిందకే లెక్క!


   -------కోడూరి శేషఫణి శర్మ

       




Sunday 1 April 2018

వర్ల్డ్ టెలుగు కాన్ఫరెన్స్

సరదాకే సుమా
--------------------
          వర్ ల్డ్ తెలుగు కాన్ఫరెన్స్
------------------------------

ఏమోయ్! నిన్న సాయంకాలం మీ యింటి కొచ్చా!
నీవ లేవు!ఏదో హడావిడిలో వున్నవట!ఏమిటి సంగతి?

ఇన్విటేషన్ వచ్చిందోయ్!

దేనికి?

అదే! వర్ ల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ జరుగుతుందిగా!

అవునా?ఏముంటాయి?

డిస్కషన్సు,పేపర్ ప్రజెంటేషన్సు,రిజల్యూషన్సూ చాల వుంటాయి!

ఎవరెవరు వస్తున్నారు?

ఓపెనింగ్ సెర్మనీకేమో వైస్ ప్రసిడెంటు, వాలిడిక్టరీకేమో ప్రసిడెంటూ వస్తున్నారు!
ఇక పోతే తెలుగు పొయెట్స్,రైటర్స్ చాలామందే వస్తున్నారు!

ఇప్పుడంత అవసరమేమొచ్చిందట?

అదేమిటి?కర్నాటక,టమిల్నాడు స్టేట్స్ చూడు!
వాళ్ల మదర్ టంగ్ కి ఎంత ప్రామినెన్స్ యిస్తారో! మనం కూడా అలా వుండాలోయ్!

ఆ వచ్చేవాళ్ంతా ఏంచెబుతారు!?

మన తెలుగుని ఎలా ప్రమోట్ చేసుకోవాలో, కల్చర్ ని, ట్రెడిషన్స్ ని ఎలా కాపాడుకోవాలో చెబుతారు!

నీవేం చేస్తావట?

డైలీ యూజ్ లో తెలుగు ఇంపార్టెన్సు గురించి పేపర్ ప్రజెంట్ చేస్తున్నా!

అంత పెద్ద సభలు కదా!ఏర్పాట్లు అవీ ఎలా వుంటాయో!

అరేంజ్ మెంట్స్ సూపర్ అనుకో?దీన్లో పార్టిసిపేషన్ లైఫ్ టైం థ్రిల్లింగ్!

క్షమించు! ఒక్క మాట చెప్పనా?

మనలో మనకేమిటి? హెజిటేషన్ లేకుండా చెప్పవోయ్!

ఇందాక పేపర్ ప్రజెంటేషన్! డైలీ యూజ్ అన్నవే!ఇప్పుడు నాతో మాట్లాడిన మాటలన్నీ తెలుగు లోకి మార్చి చెప్పెయ్!
అంతకంటే ప్రత్యేకంగా ఏమీ వద్దు!నిత్యకృత్యంగా ఇప్పుడు చెప్పిన మాటల్ని తెలుగులో మాట్లాడు!మాట్లాడమను!
తెలుగు వర్ధిల్లుతంది!

😚😚😚😚

ఏం? తెలుగును ఎలా నిలబెట్టడమో అర్థం అయిందా?

??????

🙏🙏

Thursday 29 March 2018

కన్యా వరయతే రూపం......


    ఈ మధ్య అబ్బాయిలూ ,అమ్మాయిలూ
ఎవరి జోడీ వారు చూసుకుంటున్నారు. నాకు నచ్చినవాడిని నేను చూచుకోగలను అే స్థాయికి అమ్మాయిలు,
నాకెలాంటి అమ్మాయి కావాలో నిర్ణయించడానికి మీరెవరు అని అబ్బాయిలూ అంటున్నారు!
న్యాయస్థానాలు కూడా మేజర్ అయిన వారుతమ వివాహ నిర్ణయాలు తీసుకుంటే ఇతరులు అడ్డు చెప్పడానికి లేదనీ తీర్పు చెప్పాయి.వారి నిర్ణ యాలకు వారే బాధ్యులు!
   
        తల్లిదండ్రుల ప్రమేయంతో జరిగే వివాహాల్లో కన్యకు వరుడిని నిర్ణయించడానిి ఒక పద్ధతి  వుండేది!
అదెలాగో క్రింది శ్లోకంద్వారా తెలుస్తుంది"

     కన్యా వరయతే రూపం
    మాతా విత్తం పితా శ్రుతం
   బాంధవాః కులమిచ్ఛంతి
   మృష్టాన్న మితరే జనాః
         
       అమ్మాయి వరుని రూపాన్ని చూస్తుంది!
     తనకు తగినవాడేనా?తన రూపానికి,అందానికీ సరిపోతాడా అని చూస్తుందట!
        తల్లి వరుని సంపదా ,సంపాదనా చూస్తుంది!అవును మరి అమ్మాకి ఏలోటూ రాకుండా చూచు కొనేవాడు కావాలిగా!
        తండ్రి వరుని గుణగణాలు,నడవడి చూస్తాడు!తీరా పెళ్లి అయాక అన్నీ అవలక్షణాలు కలవాడైతే?అందుకు ఆయన జాగ్రత్త ఆయనది!
       బంధువర్గమంతా తమ కులము వాడా కాదా అని చూస్తారట!

          ఇంతమందీ ఇన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు కనుకనే మనువులు దశాబ్దాల తరబడి నిలబడేవి!కాలం గడిచే కొద్దీ అనుబంధం గట్టి పడేది!
       ఇప్పుడో? ఎవరి ఇష్టం వారిది"
         కన్యా వరయతే సాఫ్ట్ వేర్!
        మాతా జీతం! పితా హోదా!
       బాంధవాః గిఫ్ట్స్ ఇచ్ఛంతి!
     పార్టీలనితరే జనాః
 
   వధూ వరులు వారి ఇష్టానుసారం పెళ్లాడి ,విడి పోవడం కూడా అలాగే మాఇష్టం అంటున్నారు
   అందరినీ అలా అనలేము!అనకూడదు! తొందరపాటు నిర్ణయాలు కాకుండా స్థిమితంగా యోచిస్తే మంచిది కదా!
   
    పెళ్లంటే నూరేళ్ల పంట మరి!














Wednesday 28 March 2018

తంజావూరు రఘునాథ రాయల శౌర్యం---స్వర్గంలో రంభకు యాతన

మందపాటి రఘునాథ మహారాజు శౌర్యాన్ని కొనియాడుతూ కవి చెప్పిన రసవత్తర మైన చాటు పద్యాన్ని చూడండి:
         రణరంగంలో పోరాడి మరణించిన వారికి వీర స్వర్గం దక్కుతందనీ,రంభాది అప్సరసల పరిష్వంగ సుఖాలు అబ్బుతాయనీ వాడుక!
        ఆ మాటను ఊతంగా కవి చమత్కరించాడు చూడండి
 . అప్సరసలు ఇంద్రుని సభకు వెళుతూ ఒకరినొకరు పిలుచుకుంటున్నారు!
రంభకు వెళ్లడానికి తీరికే లేదట!
కారణం?వినండి!సంభాషణ రూపంలో పద్యం---
పదవే రంభ సురేంద్రు కొల్వునకు!...అప్పా!నాకు రా తీరదే!
అదియేమే?...ధర మందపాటి రఘునాథాధీశు బాహాసిచే
కదన క్షోణిని నీల్గినట్టి రిపు సంఘాతమ్ము వేవచ్చెడున్
వదిలే దెప్పుడు ?వచ్చుటెప్పుడు?సఖీ వారెందరో చెప్పవే
పదులు న్నూరులు వేలు లక్షలు  గణింపన్ శక్యమే?చెల్లెలా!
          రఘునాథ భూపాలుని కరవాలానికి గురై రణరంగంలో మరణించిన శత్రు సైనికులు లెక్కకు మీరి స్వర్గానికి వస్తున్నారట!
వారిని సుఖాలలో తేల్చవలసి ఉండడం చేత ఇంద్రుని సభకు కూడా పోవడానికి రంభకు వీలు కావడం లేదట!
అవును మరి లక్షల్లో వస్తున్నారాయె!
           కోడూరి శేషఫణి శర్మ

Sunday 25 March 2018

[12/11/2017, 19:59] Kseshaphanisarma: ఏమిటి సుబ్బారావ్!గుడి కొచ్చావ్!ఏం మొక్కుకున్నావ్?

ఏం లేదండి!పోయిన వారం చేసిన పాపాలనన్నిటిని క్షమించేయమని కొబ్బరికాయ కొట్టాను!

అయితే పాపాలు చేయవన్నమాటేగా!

మీరు మరీనూ!వచ్చే వారం చేసే పాపాలను క్షమించ మని అడగడానికి మళ్లీ వస్తానని కూడా మొక్కుకున్నా!

???????
[15/11/2017, 06:33] Kseshaphanisarma: 😆😆😆

దాన ధర్మాలు చేయడంలోనూ పుచ్చుకోవడంలోనూ యిచ్చే వారి చేయి పైన, పుచ్చుకొనేవారి చేయి క్రిందనూ వుంటుంది! కానీ....
          నశ్యం విషయంలో అలాకాదు చూడండి!
ఇచ్చేవారు చిటికెడు నశ్యం వేళ్లు అలా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పట్టుకుంటే తీసుకొనేవారు పైనుండి చిటికెడు అలవోకగా అందుకుంటారు!
          నశ్యం పండిత లక్షణమట!
          ఒరే అబ్బాయ్! కాస్త నశ్యం యివ్వరా!  అని తండ్రి కొడుకును అడిగే సందర్భాలుంటాయేమో కానీ తక్కిన అలవాట్ల విషయంలో అలా కాదుగా!!!

Saturday 24 March 2018

మహాభారత యుద్ధం--రైతు సందేహం

సరదా కబుర్లు
-------------------
భారత యుద్ధం- రైతు సందేహం!
                 లక్ష్మీ పతి శాస్త్రి పేరు మోసిన పౌరాణికుడు!
అష్టాదశ పురాణాలు ఆయన జిహ్వాగ్రంలోనే వుండేవి! దేనిలో ఏ సందేహం వచ్చినా తీర్చడానికి ఆయనే పెద్ద దిక్కు!
    ఎప్పుడో గ్రామంతరం వెళితే తప్ప ప్రతి దినము రచ్చ బండ మీద పురాణశ్రవణం జరగనిదే గ్రామ ప్రజలకు తోచదు!
                   శ్రోతలకు వచ్చే సందేహాలకు శాస్త్రి గారు అక్కడికక్కడే సమాధానమిచ్చేవారు!
            ఈ క్రమంలో మహా భారతం పురాణం జరుగుతూంది! కథ ఒక్కో పర్వము పూర్తయింది.యుద్ధం అనివార్యం అయింది.పెద్దల మంచి మాటలేవీ పని చేయలేదు!
              కౌరవుల వైపు పదకొండు అక్షౌహిణులు,పాండవుల వైపు ఏడు అక్షౌహిణులు సిద్ధమయ్యాయి!  ......అంటూ చెప్పు కొస్తున్నారు  శాస్త్రి గారు!
        అయ్యా! అక్షౌహిణి అంటే ఏమిటి?.....ఒక రెడ్డి గారికి సందేహం వచ్చింది!
                  శాస్త్రిగారు యిలా వివరించ సాగారు...
            రెడ్డి గారుా! సైన్యంలో చతురంగ బలాలు వుంటాయి!అంటే . రథ గజ తురగ పదాతి దళాలన్న మాట!
           21,870---రథాలు
 . . .  .  21,870---ఏనుగులు
 . . . . . . 65,610--గుర్రాలు
 . . . . . 1,09,350--సైనికులు
కలిస్తే ఒక అక్షౌహిణి అన్న మాట! ఇలాంటివి పదకొండు కౌరవుల వైపు ,ఏడు పాండవుల వైపు తలపడినాయి..అన్న మాట! అన్నారు శాస్త్రి!
             మరో  రైతు లేచాడు!
   ఏమిటి సుబ్బారెడ్డీ? నీసందేహం ఏమిటి?..అడిగారు శాస్త్రి!

         అయ్యా! నాకు కాడెద్దులుా,రెండు బర్రెలుా,ఒక ఆవూ వున్నాయి! వాటిని కట్టేసుకోడానికే స్థలం చాలడం లే.మేపూ చాలడం లే! వాటిని మేపడానికి తోలుకు పోయే పిలగాడూ దొరకడం లేదు!నేను పొలానికి పోతే వాటి ఆలనా పాలనా చూడడానికి మా యింటి దానికి పొద్దు సరిపోవడం లేదు......
              ఇంతకీ ఏమంటావు రెడ్డీ?....అడిగారు శాస్త్రి!
             అదే నయ్యా! రెండు మూడు గొడ్లతోనే మాకింత యాతనగా వుందే!  మీరేమో . అక్షౌహిణీలని వేల రథాలు,వేల గుర్రాలు,వేల ఏనుగులు అంటున్నారు!అన్నింటి కట్టేయడానికి ఎంత స్థలం కావాలె?ఎన్ని గొలుసులు గావాలె? ఎంత మేత గావాలె?
సైనికులకు వండి పెట్టడానికి ఎంత మంది వంటవాళ్లు గావాలె!వండడానికి ఎన్ని బండ్ల వంట చెరుకు గావాలె?ఎన్ని బియ్యం,ఎన్ని కూరగాయలు,ఎన్ని నీళ్లు,ఎన్ని పాత్రలు గావాలె?ఒక్క చోట యిదంతా అయ్యే పనేనా అయ్యా! ...అన్నాడు రెడ్డి!
           అయ్యగారు ఆలోచిస్తున్నారు!
         తన సంసారంతో పోల్చకొని లెక్క కట్టబోయిన రెడ్డికి పెద్ద సందేహమే రాదగిన సందేహమే వచ్చింది కదా!

        -----కోడూరి శేషఫణి శర్మ

Friday 23 March 2018

తాతా ఊతునా!

తెనాలి రామకృష్ణుడు చాటువులు ఎన్నో చెప్పాడు!
ఆయన పైన కూడా చాటువులున్నాయి!
 . .  నంది తిమ్మనకు ముక్కు తిమ్మన అని కూడా పేరుంది!
ముక్కు మీద మంచి పద్యం చెప్పినందుకు ఆ పేరొచ్చిందట!
   సరే!ప్రస్తుతానికి వద్దాం!
 . . ముక్కు తిమ్మన ఇంటి దారిగుండా రామలింగడు వెళుతున్నాడు!
భోజనం చేసి నోటి నిండా తాంబూలంతో వున్నాడు!
తిమ్మన తన యింటి వసారాలో భోజనానంతర విశ్రాంతి తీసుకుంటూ ఊయల మంచం మీద ఉన్నాడు!
           చిలిపి రామలింగడికి ఒక పనికి మాలిన చిలిపి ఊహ వచ్చింది! వెంటనే తిమ్మన దగ్గరకు వెళ్లి '' తాతా! ఊతునా? " అన్నాడు
 . . . . . ఊయల ఊపుతాడేమోనని తిమ్మన " ఊఁ " అన్నాడు.
          వెంటనే రామలింగడు తుపుక్కున ఊశాడు! ఆ తుంపుర్లు తిమ్మన పైన పడ్డాయి!కోపంతో తిమ్మన కాలు ఝాడించాడు! కాలు తగిలి రామలింగని నోటి పల్లు వూడింది!
           మరుసటి దినం రాయల వారు .  . రవి గాననిచో కవిగాంచునే కదా!
అనే సమస్య పూరించమని ఇచ్చారు!
           అప్పుడు ధూర్జటి మహా కవి యిలా పూరించాడు

ఆ రవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసి నోటికిన్
నేరడు!రామలింగ కవి నేరిచెబో మన ముక్కు తిమ్మన
క్రూర పదాహతిన్ తెగిన కొక్కిర పంటికి దుప్పి కొమ్ము ప
ల్గా రచియించినాడు!రవి గాననిచో కవి గాంచునే కదా!

         రామలింగడు బోసినోరు కనపడకుండా దుప్పికొమ్మును అరగదీసి పంటి స్థానంలో అతికించుకొని వచ్చి కూర్చున్నాడట!
అది కనిపెట్టిన ధూర్జటి అలా సమస్య పూరించాడట!
          దక్ష యజ్ఞం ధ్వంసం చేసే సమయంలో వీరభద్రుని దెబ్బకు సూర్యునికి పల్లు వూడిందట!కానీ సూర్యునికి రామలింగనిలా ఉపాయం తోచలేదు! రవి కి తోచని ఉపాయం కవి రామలింగనికి తోచింది!
          ఆ విషయం మరో మహాకవి ధూర్జటికి తెలిసింది మరి!
కథలో నిజమేమో గాని మంచి పద్యం రూపొందింది!

Thursday 22 March 2018

పెద్దిభట్టు

పూర్వం పెద్ది భట్టు అనే కవి పండితుడుండే వాడు?

ఆయనకున్న పేరు ప్రతిష్ఠలు చూచి అమాయకురాలైన భార్య సంతోషపడిపోయేది!

అందరి మీద పద్యాలు శ్లోకాలు చెప్పే భర్త తన మీద కూడా చెబితే బాగుంటుందని చాలా సార్లు భర్తను అడిగింది!ఆయన దాటవేస్తూ వచ్చాడు!

చివరకి ఆమె మీద ఒక శ్లోకం చెప్పక తప్పలేదాయనకి!

ఆ శ్లోకం చూడండి--ఆమె ఎంత అందగత్తెయో!


మేరు మంధర సమాన మధ్యమా!

తింత్రిణీ దళ విశాల లోచనా

అర్క శుష్క ఫల కోమల స్తనీ

పెద్ది భట్ట గృహిణీ విరాజితే!


తన భార్య ఎంత అందంగా విరాజిల్లుతుందో పెద్ది భట్టు

మొహమాటం లేకుండా చెప్పుకున్నాడు చూడండి?


ఆమె నడుము మేరు,మంధర పర్వతాలతో సమానమైనదట!


ఆమె కళ్లు చింతాకులంత విశాలమైనవట!


ఆమె స్తనాలు ఎండి పోయిన జిల్లేడు కాయల్లాగా వుంటాయట!

(ఎండు జిల్లేడు కాయలను చూచిన వారికే అది తెలుస్తుంది)


ఆమె పేరు మనకు తెలియక పోయినా పెద్ది భార్యది ఎంత అందమో!!!!

కదా!!!!

పెద్ది భట్టు భార్య తెలుగు పండితురాలై యుంటే భర్తను యిలవర్ణించి యుండేది!

బాన కడుపు తోడ బరువుగా నడచును!
సొట్ట బుగ్గ లకట! చూడ లేము!
ఎగుడు దిగుడు పళ్ల నేమని వర్ణింతు?
పెద్ద అంద గాడు పెద్ది భట్టు!

భార్య భర్తలు పండితులైతే సంసారంలో సరాగాలు పంటే!

Wednesday 21 March 2018

అవధానంలో వ్యస్తాక్షరి

అష్టావధానంలో వ్యస్తాక్షరి కూడా ఒక అంశం! ఒక వాక్యంలోని అక్షరాలను ఒక క్రమ పద్ధతి లో కాక అస్తవ్యస్తంగా ఒక్కో అక్షరాన్ని ఇస్తారు!ఒకసారి 3వ అక్షరం తర్వాత పదో అక్షరం తదుపరి ఐదవది ఇలా....అవధాని మనసులోనే  క్రమంలో పేర్చుకొని చివరలో వాక్యాన్ని అప్పగించాలి!

తిరుపతి వెంకట కవులు ఏకంగా ఒక అస్తవ్యస్తంగా ఇచ్చిన శ్లోకంలోని పదాలను సక్రమంగా పేర్చి అప్పగించారు!
బందరులో 18--9--1883 న జరిగిన అష్టావధానంలో ఈ విశేషం జరిగింది!
ఆ శ్లోకం  అనేక భాషాపదాలతో
ఇచ్చాడు పృచ్ఛకుడు!
ఆశ్లోకం చూడండి:
-----------------------
శా।। యూయం,తత్ర,సిడౌన్,తథాపి,వెరివెల్,తస్మా,న్మమాయా,శశీ

నోగోసార్,మదరాసు,కాయకరితం,హింగేందు ,బాయేందునం

నింగత్పూరయ,సింగకూడ,విడుదల్,నీవాడ నంటింగదా

కిస్వాస్తే మయి బోల్తహుం,అజి సునోతక్సీర్ న మేరే ఉపర్!

         అస్తవ్యస్తంగా ఇచ్చిన ఈ పదాలన క్రమంగ పేర్చి శ్లోకం అప్పగించడానికి ఎంత బుర్ర కావాలో కదా!
పృచ్ఛకుడెవరో ?ఆపదాలకు అర్థమేమిటో!
అబ్బో!అబ్బో!
తిరుపతి వెంకట కవుల సామర్థ్యం అబ్బో!

Tuesday 20 March 2018

అమ్మా!--మమ్మీ!

అమ్మా!_____మమ్మీ
__________________
 
 . . . . అమ్మా!అమ్మా!
ఈరోజు నా కు  .....
       వెధవా! ఎవర్రా నీకు అమ్మ?నన్ను అమ్మా అంటావా?
        అదికాదమ్మా! నాకు....
మళ్లీ అదే మాటా? నన్ను మళ్లీ అమ్మ అన్నావంటే వీపు చీరేస్తా! అందర్లో నా పరువు తీస్తావా?
          అది కాదమ్మా! నాకు స్కూల్లో మొదటి బహుమతి వచ్చింది!
             ఏడిచావ్ లే? ఎందుకొచ్చింది?
           "అమ్మ ప్రేమ" గురించి మాట్లాడితేను......
            వెధవా! మళ్లీ అమ్మ ప్రేమంటావ్? బుద్ధుందా? మమ్మీ అనమని ఎన్ని సార్లు చెప్పాలి!నలుగురిలో నాకు ఎంత అవమానం? మమ్మీ అనక పోయావో పాకెట్ మనీ కట్ చేస్తా!
             అలాగే ...మ..మ్మీ !
ఇంతలో వీధిలోనుండి.....

               మమ్మీ! ఇంత భిక్షం వెయ్!మమ్మీ!!!!
                 వెధవా!ఎవర్రా నీకు మమ్మీ!అడుక్కోవడం కూడా రాని వెధవకి నేను మమ్మీ నట్రా?
                సారీ మేడమ్! అమ్మా అన్నందుకు మీ అబ్బాయిని కోప్పడ్డారని .....అలా అడుక్కున్నా తల్లీ!సారీ తల్లీ అనవచ్చునాండీ?
             ??????????

         (మమ్మీ అని పిలిపించుకోవాలని ఉబలాటపడే తెలుగు తల్లలకు అంకితం!)
            ____కోడూరి

Monday 19 March 2018

భోజన పరాక్రమం

. . . . .   . సరదా కబుర్లు
 . . . . . _______________

. . భోజన పరాక్రమం:
__________________
                        ఈ కాలంలో నాజూకుతనం మరీ మితి మీరి పోయింది!
               మంగళ హారతి కళ్లకద్దుకుంటే . వేడి చేస్తుందనీ, తీర్థం పుచ్చుకుంటే శీతం కమ్మేస్తుందనీ వయ్యారాలు పోయే వాళ్లున్నారు! తిండి దగ్గర మరీ నాజూకుతనం!ముని వేళ్లతో కెలికి తినేవారు కొందరైతే స్పూన్తో సుతారాంగా తినేవారు మరికొందరు!
                    డైటింగ్ చేసేవారేగానీ భోజన పాత్రమీద ఫైటింగ్ చేసే వారేరీ?
                    అందుకే అన్నింటా నీరసాలూ,ఉసురుసురూలూ!
                    రెండు మూడు దశాబ్దాల క్రితమేమో ఆడవాళ్లు ఏడెనిమిది గజాల చీరలు ధరిచేవారు!వారికేమీ భారమనిపించేదే కాదు .ఇప్పుడో! ఏడెనిమిది మూరల గుడ్డ కూడా బరువే!
పిదప తిండి తినే కొద్దీ గుడ్డ కురచ అయి పోవడం లేదూ!
ఆఖరికి కొప్పు బరువై కురచ కురుల కులుకులు చూడడం లేదూ!
              పోనీ బాగా తిందామని వున్నా వడ్డించే వారేరీ?  ఇళ్ళల్లో కూడా బల్ల భోజనాలేనాయే! ఉరుకులు పరుగులేనాయె!తినేదెప్పుడు? అరిగే దెప్పుడు?
                    పెళ్లిళ్లకీ పేరంటాలకీ వెళ్లినప్పుడయినా వడ్డన ఎక్కడుంది?
మీరు బంతి కూచోండి !మేం వడ్డిస్తాం అనే వాళ్లెవరున్నారు?
ఆ బకెట్లు, తపేలాలు మోయడం మాతో కాదు బాబూ!అనేవారేగా అంతా!
అంత నాజూగ్గా తయారయ్యాం మరి!
               అలా యిలా ఏదోలా
బఫే పద్ధతొకటి వచ్చింది! ఆహో! మొదటి పది పదిహేను నిమిషాలు ఎంత క్రమశిక్షణో?
అలా సాగితేయింకేం? భారతదేశం అగ్రరాజ్యమై పోదూ! ఎవరి తొందర వారిది!ముందొకరుండగనే వారి భుజంమీదుగా ఎంగిలి పళ్లెం చాపి సాంబారో రసమో పోయించుకుంటారొకరు!
 . . . . . . . ప్రతి పదార్థం దగ్గరికీ వెళ్లి అడిగి వేయించుకుంటుంటే.....ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతీ....అని గుర్తొస్తుంది!
               టేబుల్ దగ్గరనుండి కదలకుండా అక్కడే ఆబగా కూరుకొనే వారొకరైతే,ఎవరికీ సంబంధం లేకుండా దూరంగా నిలబడి జుర్రుకొనే వాడొకడు!
                కబుర్లాడుకుంటూ,పరాచికాలడుతూ కావలసింది అడిగి వేయించుకుంటూ బలవంతంగా వడ్డిచేవారిని చేతులడ్డుపెట్టి వద్దంటూ చేసే భోజన పంక్తులేవీ?ఆ భోజన పరాక్రమమేదీ?
                    తిండికలిగితె కండ కలదోయ్! కండ గలవాడేను మనిషోయ్! అన్న కవి వాక్కులు నిజం చేసే సంఘటనలూ సందర్భాలూ ఏవీ?
                 ఒక్కో ముద్దా తాటికాయ ప్రమాణంలో లాగించే రామయ మంత్రి లాంటి వారిని యిక చూడగలమా?  శ్రీ నాథ మహా కవి ఆటపట్టిస్తూ రామయమంత్రి పై చెప్పిన పద్యం గుర్తుకోవడం తప్ప!

గ్రామము చేతనుండి పరికల్పిత ధాన్యములింట నుండి శ్రీ
రామకటాక్ష వీక్షణ పరంపరచే గడ దేరెగాక!మా
రామయమంత్రి భోజన పరాక్రమమేమని చెప్పవచ్చు నా
స్వామి యెరుంగు తత్కబళ చాతురి తాళ ఫల ప్రమాణమున్!

              కోడూరి శేషఫణి శర్మ

Saturday 17 March 2018

బుద్ధిమంతులు

బుద్ధిమంతులు ఎలా కాలం వెళ్లబుచుతారో యీ శ్లోకం చదివితే తెలుస్తుంది:

ప్రాతర్ద్యూత ప్రసంగేన
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః
రాత్రౌ చోర ప్రసంగేన
కాలో గచ్ఛతి ధీమతాం।।
           
              బుద్ధిమంతులు ప్రాతఃకాలములో జూదానికి సంబంధించిన విషయాలను, మధ్యాహ్నం స్త్రీకి సంబంధించిన విషయాలను, రాత్రి చోరులకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుకుంటూ కాలం గడుపుతారట!
 . . . . . . . . భలే వుంది కదా!
జూదము,స్త్రీ,దొంగతనము గురించి మాటలాడుతూ రోజంతా గడిపేవాళ్లు బుద్ధిమంతులేనంటారా?
              చూద్దాం:
జూదం ప్రముఖ పాత్రవహించి నడచిన కథ ...భారతం!భారతంలో లేని ధర్మాలు లేవు!
ప్రాతఃకాలములో అంటే జీవితం తొలిదశలోనే అన్ని ధర్మాలను ఆకళింపు చేసుకోవాలి!అంటే భారతం గురించి మాట్లాడుకోవాలన్న మాట!
           మధ్యాహ్నకాలం అంటే జీవితం రెండవ దశ!సంసారము,సంతానము,వారసత్వము మొదలైనవి అనుభవించేకాలం!
లోకంలో కైకేయి లాంటివారుంటారు! శూర్పనఖ లాంటి వారుంటారు! సీతలాంటివారూ వుంటారు!
ఆయా కష్టనష్టాలు, సుఖదుఃఖాల గురించి అవగాహనకోసం రామాయణాన్ని చదవాలి!
           రాత్రి అంటే జీవితంలో వృద్ధాప్యం!
అన్నీ అనుభవంలోకి వచ్చేసి వుంటాయి!మంచీ చేడూ చూచి వుంటారు.సంసార తాపత్రయంలో పడి దేవుడు దైవము ఆత్మ పరమాత్మ వగైరా గురించి పట్టించుకొనక పోయివుండవచ్చు!అన్ని బాధ్యతలు తీరినతరువాతనైనా, బాధ్యతలు వదలింకొని అయినా పారమార్థిక దృష్టికి మరలాలి!అందుకు భాగవతం చదవాలి భక్త మానసచోరుడూ శ్రీ కృష్ణుడు కదా!అదే చోర ప్రసంగం!
             అదీ వరస.....
భారత రామాయణ భాగవత చర్చలతో బుద్ధిమంతులు కాలం గడపాలని జీవితం సుగమం చేసుకోవాలనీ వాళ్లే . బుద్ధి మంతులనీ . తాత్పర్యం!
     
 . . . . . . . . కోడూరి శేషఫణి శర్మ!

Friday 16 March 2018

వెర్రి వేయి విధాలు

సరదా కబుర్లు
----------------+++

                వెర్రి వేయి విధాలు
              ---------------------------

వెర్రి వేయి విధాలన్నారు!ఆ విధాలనన్నిటిని ఏకరువు పెట్టమంటే యిక్కడ సాధ్యం కాదులెండి!
               అదేమిటో? వెధవ పనులకు సవాలక్ష మార్గాలుంటాయి కానీ మంచి వాటికి మాత్రం చాలా తక్కువ మార్గాలుంటాయి!అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చునన్నమాట!
     
         భక్తి చూడండి! కేవలం నవ విధ భక్తులు! అంటే మన భక్తిని చాటు కోవాలన్నా,భగవంతుని పట్ల భక్తి తత్పరతతో వుండాలన్నా తొమ్మిది మార్గాలే!
              ఒకటి వీలు కాకపోతే మరొకటి....తొమ్మిది మార్గాలున్నాయి కదా అని ఆశా వాద భక్తులు తృప్తి పడుతుంటారు!
           సరే నయ్యా! ఆ తొమ్మిది ఏవేవో చెప్పరాదూ...అంటారా? అవేనండీ...శ్రవణం,కీర్తనం,స్మరణం,పాదసేవనం ,అర్చనం,వందనం,ధ్యానం,సఖ్యం,ఆత్మ నివేదనం.....
             భగవంతుడు ఎంత భక్త సులభుడు! ఇవి కూడా చేత గానివారిని ఏ దేవుడూ ఏమీ చెయ్యలేడు!మనం మాత్రం ఏం చేస్తాం!
                పైన చెప్పిన తొమ్మిది మార్గాలు కాక మరో మార్గాన్ని వెదికారు కొందరు!
తామే ఫలానా దేవుడికి భక్తులమనీ,ఆ ఫలానా దేవుడిని గూర్చి భయపెట్టి యితరులను కూడ ఆ దేవుని తలచు కొనేట్టు చేయాలనీ వెర్రి మార్గాన్ని కని పెట్టారు!అంటే వెర్రి భక్తి అన్న మాట!ఇదీ నవ విధ భక్తులకు తోడు పదవ భక్తి!
        ఎక్కడో ఎవరో ఒక దేవుడు ఎవరో ఒకరికి కలలో కనబడి తనగురించి పాతిక మందికి ఉత్తరాలు రాయమన్నాడట!అలా రాస్తే ఊహించనంత మేలు జరిగిందట!ఉత్తరం అందుకున్నవారు కూడా అలా రాయాలట! రాయని వారికి నష్టం జరుగుతుందట!
            ఇదీ వారి వెర్రి భక్తి!
భయపెట్టి దేవుని గురించి ప్రచారం ఏమిటో అర్థం కాదు!
           అసలు భగవంతుడు భయాన్ని పోగొట్టేవాడా?భయాన్ని కలిగించే వాడా?
             భయాన్ని కలిగించే వాడైతే రాక్షసుడు గాని దేవుడెలా అవుతాడు!
            ప్రజలను భయపెట్టిన రాక్షసుల పని పట్టడానికి కదా భగవంతుని అవతారాలన్నీ!ప్రతి అవతార లక్ష్యం అదే కదా!
మరి యిలా దేవుడి పేరు మీద భయపెట్టే ఉత్తరాలు రాసే వారు ఎవరు?అలా భయపెట్టే వారిని భగవంతుడు వూరికే వదిలేస్తాడా!  ఓరి భడవా !నా పేరుతో అమాయకులను భయపెడతావా!అని వారి భరతం పట్టడూ!
         ఎందుకు పట్టడండీ?ఏదో ప్లాను వేస్తూనే వుంటాడు!

భయపెట్టే వారి భరతం పట్టడానికే భగవంతుడున్నాడు!!!!

  ---------కోడూరి శేషఫణి శర్మ

Thursday 15 March 2018

పెళ్లిళ్లలో అలుకలు -అనునయాలు

సరదా కబుర్లు
---------------------
          పెళ్లిళ్లలో అలుకలు--అనునయాలు
------+----------------------------

            డబ్బుండాలి గానీ యీ కాలంలో పెళ్లిళ్లు చేయడం పెద్ద పనేమీ కాదు! కొండ మీది కోతి నయినా తీసుక వచ్చి డాన్స్ చేయించ వచ్చు!
            రెండు మూడు దశాబ్దాల క్రిందట పరిస్థితి వేరు!కేటరింగ్ సౌకర్యం లేదు.కుర్చీలు బల్లలు యిచ్చే సప్లయర్స్ లేరు!అన్నీ అక్కడా యిక్కడా పురమాయించు కోవలసిందే!
               పల్లెల్లో పెళ్లి అంటే యజ్ఞమే!పాలు,పెరుగు ,పూలహారాలు మొదలు పురోహితుడు,వంటవాళ్ల వరకూ అన్నిమటినీ సమకూర్చుకోవాలి!దేనిలో కాస్త పొరబడినా వచ్చే పెళ్లి వాళ్లతో గొడవే!
         కాలం మారి పట్టించుకోవడం లేదు గానీ పూర్వం ప్రతి విషయానికీ గొడవే!
           ఇప్పుడు చెబితే కాస్త ఎబ్బెట్టుగా వుంటుంది గాని పెళ్లళ్లల్లో అలుకలపై పి హెచ్ డి కి సరిపడా సామాగ్రి దొరుకుతుంది!
            అలుకకి పెద్ద కారణం కూడా అవసరం లేదు!ఏ చిన్న పొరబాటో,మరపో చాలు!
తగాదా మొదలౌతుంది!
             ఒక ఉదాహరణ.....
ఇతర ప్రాంతాల్లో ఏమో గానీ రాయల సీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లా లో చింతకాయ పచ్చడికి తోడుగా ఉలవపొడి ని అన్నంలో కలుపుకోవడం అలవాటు! రడీ మేడ్ పచ్చళ్లు దొరికేవి కావు.పెళ్లి కోసం నిమ్మ,మామిడి, గోంగూర పచ్చళ్లు చేసి వుంచేవారు"
            ఒక పెళ్లిలో చింతకాయతో బాటు ఉలవపొడి వడ్డించడం మరిచి పోయారు! ఇంకే ముంది?మగ పెళ్లి వారికి  అవమానం జరిగి పోయింది!మూతులు ముప్పై వంకర్లు తిరిగాయి!సర్ది చెప్పడానికి మధ్యవర్తి తలప్రాణం తోకకి వచ్చింది!
           పెళ్లికి ఆడ వాళ్లు యాభై మంది వచ్చారు! పూలహారం నలభై తొమ్మిది మూరలే విడిదికి పంపారు!వియ్యపురాలికి కోపం రాదా మరి!
        ఎదురుకోలు అనే తతంగం ఒకటి వుంది! వధూ వరులు కాస్త విశేషంగా తయారవుతారు! అమ్మాయి చేతికి స్నేహితురాలెవరో తన రిస్ట్వాచ్ పెట్టింది! పెళ్ళికొడుక్కి అవమానమయింది!అతి శయోక్తి కాదు.దశాబ్దాల వెనక్కి వెళ్ండి!
           పెళ్లివారు వచ్చే వేళకి కరెంటు పోయింది!వర్షం!ఎవరో కాలు జారి పడ్డారు,వియ్యపురాలి వదినగారు అలిగారు!
          ఇలా ఎన్నో! పెళ్లిలో పేకాట రాయుళ్ల బాచ్ పప్రత్యేకం!వారు వున్న చోటికే కాఫీలు,టీలు!లేక పోతే పెళ్లి పెద్దకి మర్యాద తెలియదు!
          ఇలా చాలా వున్నాయి!
కొన్నిసార్లు తమాషాలు కూడా జరుగుతుంటాయి.
             పూలబంతు లాడించడం ఒక సరదా!ఆ సందర్భంలో కాస్త ఉత్సాహవంతురాలైన ఒక పూర్వసువాసిని అమ్మాయి పక్షంలోన నిలబడి అబ్పాయిని...అలా కాదు..ఇలా వెయ్యాలి అంటిటూ ఆట పట్టించింది
అబ్బాయికి చిర్రెత్తుకొచ్చి నీవు కాస్త కూచో!ఇద్దరం ఆడదాం!నేను నేర్చు కున్నాక మేం ఆడతాం!సరేనా అన్నాడు!అంతే ఆవిడ వెళ్లి పోయింది!ఆట సాగింది!
 పూర్వకాలం యిలా ఎన్నో!

--------కోడూరి శేషఫణి శర్మ

Wednesday 14 March 2018

భుజాలు తడుముకుందాం!

. . . . . .  . భుజాలు తడుముకుందాం
_________________।_
                 మేము తెలుగు వాళ్ళం!అవును...మేము తెలుగు వాళ్లం!
                   వేకువనే లేచే అలవాటు మాకు లేదు.అర్లీ మార్నింగ్ మాత్రమే లేస్తాం!పళ్లు తోముకొనే అలవాటు లేనే లేదు.బ్రష్ చేసుకుంటాం! అవును...చెప్పలేదు కదూ....మాకు పడగ్గదులు లేవు...ఉన్నవన్నీ బెడ్ రూమ్సే!
                   ఉపాహారమంటే మాకు యిష్టం వుండదండీ! ఎయిటో క్లాక్కి టిఫిన్ తింటాం!  మా పిల్లలని బడికెందుకు పంపుతాం! స్కూళ్లకే పంపుతాం!పెద్ద పిల్లల్ని కాలేజీలలకే పంపుతాం!
కళాశాల అంటారట కానీ అదేమో మాకు తెలియదు!
                      మధ్యాహ్నం మీల్స్ చేస్తాం! కాకపోతే లంచ్ అయినా చేస్తాం కానీ భోజనం అసలు చేయం!
                     ఈవినింగ్ చిరుతిండ్లు లాంటివి నచ్చవు. పిల్లలతో బాటు స్నాక్స్ తీసుకుంటాం!
                    మా పిల్లల్ని చిల్లరగా ఆటలాడనివ్వం!గేమ్స్ ఆడుకొమ్మంటాం!
                    నైట్ ఎయిటోక్లాక్కి డిన్నర్ ముగిస్తాం!చాదస్తులు మధ్యాహ్నం డిన్నరనీ,నైట్ సప్పర్ అనీ అంటారట! మాకేమో లంచ్, డిన్నరే అలవాటు!
                         మా ఆడ వాళ్లంతా శారీస్ కట్టుకొని జాకెట్ వేసుకుంటారు! ఈ కాలంలో చీర, రవికె ఏం బాగుంటాయి? చెప్పండి!
                         తెలుగు . .  తెలుగు .  . అని పెద్దలంతా అంటారు గానీ మేం యింత దాకా చెప్పింది తెలుగులో కాదూ! మేం తెలుగు వాళ్లం కాదూ! కాదంటే మాకు ఐస్ లో వాటరొచ్చేస్తుంది!మరీ నీచంగా కన్నీళ్లు రావడం బాగుండదు కదా! మీరు అవునంటే కాస్త స్మైల్ చేస్తాం! చిరునవ్వుల చాదస్తాలు మాకు లేవు!
                  అవును....చాదస్తానికి ఇంగ్లీషు వర్డ్ ఏమిటో ఎవరయినా చెప్పరూ!
                    ఏమిటో యింకా చాలా చెప్పాలని వుంది కానీ మీకు బోరు....అదేనండీ....విసుగో...ఏదో ...అంటారే అది వస్తుందేమో! టుమారో....లెటజ్ మీట్!! ఓ కే . నా?

                 కోడూరి శేషఫణి శర్మ..

Tuesday 13 March 2018

చదువూ--చట్టు బండలూ

. . . . . . . . . సరదా కబుర్లు

 . . . . . . . .  . ___________

చదువూ _చట్టుబండలు:

                    

                 బారసాల నాడే పిల్లల భవిష్యత్తు నిర్ణయించేస్తున్నారు తల్లిదండ్రులు!

                   కార్పొరేట్ స్కూల్లో చదవాలి!

                ఐ ఐ టి సీటు కొట్టాలి!

                 ఇంజినీరై ఇండియన్ ఎయిర్ లైన్స్ లో ఎగిరి పోయి యునైటెడ్ స్టేట్స్ లో వాలి!డాలర్ల వాన కురవాలి!

               అబ్బాయేమో అమెరికా.....అమ్మాయేమో ఆస్ట్రేలియా......అని చెప్పుకోవడానికి ఎంత ఉబలాటమో!

                  వాళ్ల కలల కోసం పిల్లల్ని కాల్చుకు తినడం మొదలవుతుంది!కాన్వెంట్ల చుట్టూ తిప్పడం మొదలవుతంది.

                తమాషా ఏమిటంటే ఆంగ్లమాధ్యమ పాఠశాలలన్నీ కాన్వెంట్లే అని చాలామంది భ్రమ!కాన్వంట్ అంటే సన్యాసినుల మఠము అని మీ లాంటి వారు చెప్పినా విని పించుకోరు!

                బళ్లో చేర్చిన ప్పటినుండీ పోటీ! పక్కింటి బన్నీగాడి కంటే నీకు మార్కులు తక్కువెందుకు వచ్చాయ్? బంటీ గాడికి నీకంటే ఎక్కువెందుకు వచ్చాయ్? ఏ యింట చూసినా యిదే రొద!

         ఇది మంచికి దారి తీయడం లేదు !సరికదా!కక్షకి,పగలకి కారణమవుతూంది!

ఒకటి రెండ్లు నేర్చుకునే ఓ చిన్నారి పడే హింస సామాజిక మాధ్యమాల్లో వీడియో చూచే వుంటారు!

             తనకన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొనే అమ్మాయి నీళ్ల సీసాలో దోమల మందు కలిపిందో అమ్మాయి!

విచారణకి భయపడి తానూ తాగింది...చూ..ఈనాడు పత్రిక 24_8_2017  ...

 . . . . . . . . . . అంటే మనం పిల్లలకి ఏం నేర్పుతున్నట్టు?

తెలిసిన అమ్మాయి దగ్గర నేర్చుకోమ్మా అని చెప్పాలి!

 . . . . . . తెలియని వారికి నేర్పిస్తే నీతెలివి పెరుగుతుందమ్మా అనీ చెప్పాలి!   

      అంత ఆలోచన మనకెక్కడిదీ!

   మన పిల్లలే ముందుండాలి!

ఈ ఒత్తిడి తట్టుకోలేక పోతున్నారు పిల్లలు! మానసిక రోగ చికిత్సానిపుణులూ అదే అంటున్నారు!

         ప్రాథమిక స్థాయి వరకూ తాము నేర్చుకుంటున్నట్టు తెలియకుండానే పిల్లలు నేర్చుకోవాలి!

        ఓ తాతగారు!ఆరుబయట వెన్నెల రాత్రి! మంచం మీద పడుకొని మనుమడితో ముచ్చటలాడుతూనే అక్షరాలు నేర్పుతున్నాడు!పలకా లేదు!బలపం లేదు! తాత బొజ్జే పలక!మనుమడి వేలే బలపం!మనుమడికి తమాషాగానూ వుంది!నేర్చుకున్నవి తాతకు చెప్పినట్టుగానూ వుంది        వ

తప్పు పోతే స్పర్శ ద్వారా తాతకు తెలుస్తుంది!సున్న వచ్చి నపుడు తాతబొడ్డు చుట్టూ తిప్పడం మనుమడికి సరదాగానూ వుంది!

 . . . . చేలో రేగు చెట్లు! గట్టుమీద తాతగారు! రాలి పడిన రేగుపళ్లు ఏరుతూ మనుమలు తాత పలికించే అమరకోశం పలుకుతున్నారు!     

           తెలియకుండానే చదువు వచ్చేస్తూంది!

          అచ్చు అలాగే కాక పోయినా  " రీ రైట్ ట్వంటీ టైమ్స్ " పోయి చదువు సరళం కావాలి!

 . . . . . . అందుకు కొత్త మార్గాలు వెతకాలి!

               అందుకు బాధ్యత అందరిదీ!!!!!


కొసమెరుపు: పైన చెప్పిన ఘట్టాలలోని మనుమడి పేరు:

శేషఫణశర్మ!


______కోడూరి శేషఫణి శర్మ

Sunday 11 March 2018

అర్థం చేసుకోరూ!

. . . . . . . . సరదా కబుర్లు।________________________

అర్థం చేసుకోరూ!
_______________
                         రాత్రి వేళ! విద్యుద్దీపాల వెలుతురు!
                       పెళ్లి ఊరేగింపు!అమ్మాయి చక్కగా పట్టు చీరలో తళతళలాడుతూంది!అబ్బాయి సూటు బూటు టై వగైరా హంగులతో బాటు నల్ల కళ్లజోడుతో వున్నాడు!
            పాపం!పుత్తడి బొమ్మకి పుట్టు గుడ్డి దొరికాడేమిటే?....ఆడవాళ్లు బుగ్గలు నొక్కుకుంటున్నారు!
      ఛీ!అదేం కాదు .ఆ వేషానికి నల్లకళ్ల జోడు లేకపోతే ఎలా!
అనుకుంటున్నారు కొందరు!
రాత్రిపూట చలువ కళ్లద్దాలు అనవసరం అని వాడికి తోచలేదు.ఎవరూ చెప్పనూ లేదు.
           చాలా మంది సమయ సందర్భాలు లేకుండా వస్త్రధారణ . అలంకారాలు చేసుకుంటూ వుంటారు!
              పెళ్లి తంతు నడిపే బ్రాహ్మడిని సూటు బూటులో చూడ శక్యమా?మడిలో వరి నాటు వేసే ఆడవాళ్లని జీరాడు కుచ్చిళ్లతో బారెడు పైటతో చూడగలమా!అదేదో పాటలో చెప్పినట్టు "పిక్కలపైదాకా చుక్కల చీర గట్టి...."వుండడంలోనే సుఖమూ సౌఖ్యమూనూ!అరవ కట్టు అడ్డ గుడ్డతో సైకిల్ తొక్కడం కష్టమే కదా!
             పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడు . కండువా లేనిదే గడప దాటని వాడు....అని తెలుగు వారి ఆహార్యాన్ని సి . నా . రె . ఎంత బాగా చెప్పారో!
                ఒక్కో ప్రాంతంలో ఒక్కో వస్త్రధారణ! వృత్తిని బట్టి . ఆచారాన్ని బట్టి . వాతావరణాన్ని బట్టి ఆహార్యమైనా .  ఆభరణమైనా!
              కాశ్మీరీ లాగా కడప కర్నూలు జిల్లా వాళ్లు రేయింబవళ్లు రగ్గు కప్పు కొని తిరగ గలరా! బంగాళా దుంపలాగా ఉడికి పోరూ!
              దక్షిణాది వేద పండితుల్లా ఉత్తారాది పండాలు కేవలం ఉత్తరీయంతో వుండగలరా!
                 కానీ లోకం పోకడ అలా లేదే!
              ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు వెళ్లే మన రాష్ట్రాల పిల్లల అవస్థ చూడండి!
              డ్రస్సు,టై ,సాక్స్ ,బూట్స్ . . మెళ్లో మూర్ఛ బిళ్లలా వేలాడే ఐ డి కార్డు...అబ్బో!ఒకటా! ఇంకా ఎన్నో.....!
             ఎందుకివీ!అనుకరణ రోగం కాదూ!
                శీతల పాశ్చాత్య దేశాల్లో ఉదయమే పాఠశాలలకి పిల్లలను పంపాలంటే ఈ లంపటం అవసరమే!అక్కడ చలికి,ఆవాతావరణానికి తగ్గట్టు ఒళ్లు,కాళ్లు ,మెడకు ఆ రక్షణ అవసరమే!
                ఉష్ణ దేశంలో మనకెందుకు? 
                అజాగళ స్తనంలా టై ,చెమటతో అసౌకర్యంగా వున్నా కూడా సాక్సు,కాళ్లు ఒరుసుకు పోయేలా బూట్లు....!
              పిల్లల్ని యింతగా యిబ్బంది పెట్టాలా? అదీ చలి కాలమైనా వేసవి కాలమైనా ఒకటేనా? చెమటతో చర్మరోగాల బారిన పడినా పరవాలేదా?
                 ఏ తల్లీ అడగదు!ఏతండ్రీ అడగడు!
                    ఆపాఠ శాల ఉపాధ్యాయ బృందమూ యాజమాన్యమూ అలాంటి  యిబ్బంది కలిగించే దుస్తుల్లో మగ్గు తున్నారా? లేదే!
      పిల్లలకు మాత్రం ఎందుకిీ శిక్ష?
        అర్థం చేసుకోరూ . !!
 
          ____కోడూరి శేషఫణి శర్మ

Thursday 8 March 2018

బంగారం

. . . . .  . . . సరదా కబుర్లు
 . . . . . . . . _____________
     బంగారం:
                  లోకో భిన్న రుచిః అంటారు .ఒక్క విషయంలో మాత్రం లోకమంతటిదీ ఒకే రుచి! అదే బంగారం!
                   బంగారం మీద మోజు లేని వారుండరేమో! ఇనప్పెట్టెలో బంగారం లేక పోయినా ఇంట్లో బంగారం వుండాలని పిల్లలకి బంగారయ్య,బంగారమ్మ, బంగారు బాబు స్వర్ణ కుమారి స్వర్ణ గౌరి సువర్ణ .....యిలా పేర్లు పెట్టి మురిసి పోతుంటారు!
                   సినిమా వాళ్లకీ యీ బంగారు పిచ్చి వుంది! కొన్నేళ్ల క్రిందట బంగారు గాజులు బంగారు చెల్లెలు . బంగారు పంజరం . బంగారు చిలక  బంగారు కుటుంబం లాంటి బంగారు సినిమాలు వచ్చాయి!
              సామాన్యులు బంగారాన్ని గ్రాములు తులాల చొప్పున కొని ధరిస్తే భారీ కుటుంబాలవాళ్లు భార్యల్ని ఏడు వారాల నగలతోనూ నిలువెత్తు నగలతోనూ ముంచెత్తుతుంటారు!ఒక్కో వేలికీ రెండేసి ఉంగరాలతో ఊరేగేవాళ్లుా వుంటారు!
మగవాళ్లూ రకరకాల బంగారు నగలతో కనపడుతుంటారు!
          తమ సంపదని కొందరు బంగారు యిటుకల రూపంలో దాచుకుంటారు! మరీ అక్రమ సంపాదనపరులు యింట్లో బంగారు ఫర్నీచర్తో విర్ర వీగుతుంటారు.
                   పెళ్లి కుమార్తెల గురించి చెప్పేటపుడు "అమ్మాయికేం!బంగారు బొమ్మలా వుంది ! "అంటూవుంటారు.ఆ పుత్తడి బొమ్మలే యిత్తడి బొమ్మలై అత్త మామలకు బొమ్మ చూపిస్తుంటారు.
 . . . . . . . . . . . "నీ ఇల్లు బంగారం గానూ "అని అది తిట్టో దీవెనో తెలియకుండా లౌక్యం చూపేవారుంటారు!
మా యిల్లు బంగారమే అని చూపడానికి ఇంటి గేటు పక్క  "స్వర్ణ నిలయం"అని నామఫలకం తగిలిచే వారూ వుంటారు.
 . . . . . . . . . బంగారం కొనడానికి శక్తి లేనివారు కొందరు ఆశతో బంగారు తయారు చేస్తామని చెప్పే మోసగాళ్ల వెంట తిరుగుతారు!
రసవాదం పేరుతో ఆమాయగాళ్ళు వీళ్ల భార్యల పుస్తెలను కూడా అమ్మించిగానీ వదలరు.
            బంగారం ఒక మూలకమని ,తయారు చేయడం సాధ్యం కాదని చెప్పినా వదలరు.
                   పిచ్చి కాక పోతే ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చ గలిగి నప్పుడు బంగారమే ఎందుకు?ఇనుము తయారు చేస్తే చాలదూ! ఇనము మాత్రం తక్కువ ఖరీదా???
           
                ___కోడూరి శేషఫణి శర్మ
. . . . . . . . . సరదా కబుర్లు
 . . . . . .  . . . ____________
  కుచచేలోపాఖ్యానం:
                   ఏమిటి ?శీర్షికలో పొరబాటు అనుకుంటున్నారా? అచ్చంగా యిది కుచచేలోపాఖ్యానమే! కుచేలోపాఖ్యానం అందరికీ తెలిసిందే! ఇదీ అంతే ! కుచచేలమండీ!అంటే పైట కాదా!
                 పైటను తగలెయ్యాలి.....అని ఆ రచయిత్రి ఎవరో అన్నారు గానీ పైటలోని అందం,సుఖమూ,సౌకర్యముా పైట వేసిన వారికే తెలుస్తుందని 
పెద్దల ఉవాచ!
                     పైటలో ఎంత ఆకర్షణ వుందో చేతికందిన తువ్వాలు గుడ్డను పైటలాగా వేసుకొని ఆరిందాలా తిరిగే ఆరేడేళ్ల అమ్మాయిని చూస్తే తెలుస్తుంది!
                  పైట పరికిణీలో కనిపించే యుక్త వయస్కురాలి అందమే అందం! పైట వేసుకున్న యింతులు జడలో బంతిపువ్వుతో గొబ్బిళ్ల చుట్టూ గెంతులు వేస్తుంటే ముచ్చటే కదా!
             ఫ్యాషన్ ముదిరి చున్నీ చుడీదార్ అంటున్నారు గానీ చున్నీకి పైటకూతేడా ఏదీ?
స్త్రీ అందాన్ని గౌరవంగా దాచడానికి చున్నీ అయినా పైట అయినా ఒకటే కదా!
                  అసలు పైట గొప్పదనమేమిటి? పైట కొంగు భుజాలనిండుగా కప్పుకున్న పెద్ద ముత్తైదువ కనబడితే చేతులెత్తి మొక్కాలనిపించదూ!పల్లె పడతులు ఒకమాదిరిగా కట్టిన పైటలో చంటిపిల్లను వీపున మోస్తూ పొలం పనులకు వెళుతుంటారు కదా!
                     అంతెందుకు? బయట అలసి సొలసి వచ్చిన శ్రీవారికి మంచి నీళ్లిచ్చి పైటకొంగుతో విసిరి చూడండి!ఆమురిపెమే వేరు!
                     కరెంటు పోయి ఉక్కపోతగా వుంటే విసనకర్ర అందుకొనే ఓపిక లేక పైటతో విసురుకోవడంలో హాయి లేదూ!
                 సాయంకాలం పెరట్లో మల్లెలు గిల్లి పైటలో వేసుకొచ్చి మాలకట్టుకోవడం లేదూ!
             తడిచేయి తుడుచుకోవడానికి తటాలున చేతికి దొరికే తుండు పైటే కదా!
                 కొంతమంది మగవాళ్లకి పైరగాలి ఎంత యిష్టమో పైట గాలీ అంతే యిష్టం!అందుకే ఓ పాత సినిమాలో' కొమ్ములు తిరిగిన మగవారు మాకొంగు తగిలితే పోలేరు' అని ఓపాటను జనంలోకి వదిలారు.వెనుకటి కాలంలో పిక్కల దాకా వుండే పైట ప్రస్తుతం నడుము దగ్గర తారట్లాడుతూంది.
 . . . . . . . . . . . . . ఆడవాళ్ళకి కోపమొస్తే కొంగు విదిలించి లేచిపోతారు.కోపమూ దుఃఖమూ వస్తే ముక్కూ మూతీ తుడుచుకుంటారు!
                     పైట వలన అన్ని సౌఖ్యాలు సౌకర్యాలూ వున్నాయి మరి!
కొస మెరుపు:
      శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారి అష్టావధానం!అప్రస్తుతాంశంగా
కుచేలోపాఖ్యానం చదివే వుంటారు!కుచచేలోపాఖ్యానం చదివారా!అని అడిగాను
 . . . . . . . . . మరుక్షణంలో" "సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్......"అంటూ అందుకున్నారాయన.
   ఒౌను! శ్రీ హరి కూడా శ్రీలక్ష్మి కొంగు పట్టుకొని తిరిగేవాడే మరి!
...............కోడూరి శేషఫణి శర్మ

Monday 5 March 2018

మిలిటరీ భోజనం

. . . . . . . సరదా కబుర్లు
 . . . . . . . ____________
   మిలిటరీ భోజనం
________________
                 ఈమధ్య ఎక్కడా కనబడడం లేదు కానీ నా చిన్న తనంలో కర్నూలులో.....మిలిటరీ భోజన శాల . . .  . . అని కొన్ని హోటళ్ల బోర్డులు కనిపించేవి. లోకం తెలియని వయస్సువాడి!
'ఓహో! ఇక్కడ మిలిటరీ వాళ్లు
 భోంచేస్తారేమో ' అనుకొనే వాడిని.తరువాత తెలిసింది మాంసాహార భోజనశాలలకే ఆపేరు పెట్టారని!
                  . . . తిరుపతికి చెందిన మహా పండితులు కీ.శే.గౌరి పెద్ది రామ సుబ్బ శర్మ గారి సమక్షంలో యీ 'మిలిటరీ భోజనం' అనే ప్రస్తావన వచ్చింది!
             'అబ్బాయ్!మిలిటరీ భోజనమంటే మనదిరా!'అన్నారాయన.
 . . . . . . . అదెలాగండీ!పక్కా శాకాహారులం! కాస్తో కూస్తో ఆచార చేలాంచలాలు తిరుగుతున్నాం! మనది మిలిటరీ భోజనమా?' అన్నాను
 . . . . . . . . . వారి వివరణ నామాటల్లో.....
                  మన పంక్తి భోజనాలు చూడండి! మిలిటరీలో కేడర్లు,ర్యాంకుల వారీగా నిలుచున్నట్లు మడి భోజనం చేసేవారు వయసులో పెద్దవారు ఆతరువాతి వారు చివరగా కుర్రకారు పంక్తి దీరి కూర్చుంటారు!విస్తర్లు వేయడం నీళ్ల పాత్రలు అందించిన తరువాత వడ్డన మొదలవుతుంది.ఎలా?
మొదట లవణం తరువాత పచ్చళ్లు పప్పు కూరలు వడియాలు వగైరా . ఎడమ వైపు వేయవలసినవి ఎడమ,కుడివైపు వేయవలసినవి కుడి ప్రక్క  మధ్యలో అన్నం అలా ఎక్కడివక్కడ క్రమం తప్పకుండా వడ్డిస్తారు.వడ్డన పూర్తయిందనడానికి గుర్తుగా ప్రతి విస్తరిలో నెయ్యి అభిఘరిస్తారు!
                 మగవారంతా ఆపోశన తీసు కోవడంతోనూ భగవన్నామ స్మరణతోనూ భోజన కార్యక్రమం మొదలు!
 . . . . . . . . పచ్చడి . పప్పు . చారు . . . . మధ్యమధ్య నంజుళ్లు . . . తీపు . . . మజ్జిగ యిలా ఒక క్రమంలో పదార్థాలు వస్తూంటాయి!
                   ముందుగ తినడం పూర్తయినవారు లేవరు.అందరిదీ అయినంత వరకు భోజన కాలే శ్లోకాలతో అలరిస్తారు!
                 ఉత్తరాపోశన తీసుకున్న తర్వాత అందరూ ఒక్క సారిగా లేస్తారు!
                 వడ్డన మొదలు ముగింపు వరకు ఒకే క్రమం !క్రమ శిక్షణ! మిలిటరీ క్రమ శిక్షణ!
         ఇప్పుడు మిలిటరీ భోజనం ఎవరిది???
               __కోడూరి శేషఫణి శర్మ.

Sunday 4 March 2018

పుస్తకాభిప్రాయాలు

. . . . . . . సరదా కబుర్లు
 . . . . . . . _____________
 పుస్తకాభిప్రాయాలు:_
                కొంత మంది రచయితలకు,కవులకు తమ పుస్తకాలకు పెద్దవారి చేత అభిప్రాయం రాయించుకోవాలని ఆశగా వుంటుంది!కొంతమందికి అలా రాయాలనే ఉత్సాహమూ వుంటుంది !రాయడంలో కొంతమందికి మొహమాటమూ వుంటుంది!
               ఒకాయన ఎక్కాల పుస్తకం అచ్చు వేయించాడు! దానికి అభిప్రాయం రాయమని ఓ పెద్ద మనిషిని కోరాడు. ఎక్కాల పుస్తకానికి అభిప్రాయం రాయడమేమిటంటారా! మొహమాటం! ఎందుకు రాయకూడదూ? రాశారు!!!
చూడండి!
              _____ఎక్కాలపుస్తకమనగా ఎకసెక్కము గాదు!ఎక్కములు అనగా లెక్కలకు సంబంధించినవి.లెక్కలు మన జీవితంలో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తున్నవో మనఅందరికీ తెలుసు.అసలు "సున్న"కనగొన్న మన దేశ వాసులకు లెక్కల గురించి తెలియకుండా వుండదు!
 . . . . . . . . . లెక్కలేని జీవితం గడిపే వారుంటారేమో గాని లెక్కలు లేకుండా జీవితం గడిపే వారుండరు!
                   ఎక్కములనగా గుణింతములే! ఒక అంకె ఎన్ని రెట్లు పెరిగితే ఎంత అవుతుందో తెలిపేవే ఎక్కములు.ఒకటో తరగతి విద్యార్థి మొదలు చదువు ముగించిన వారి వరకు ఎక్కముల అవసరం వుంటుంది! ఇరవై ఎక్కములు కంఠస్థం చేసేవారికి గుణింతములు,భాగహారములు చేయుట సులభమగును.
              ఈ విషయము తెలిసిన ముద్రాపకులు ఎక్కముల పుస్తకమును
 అందంగా ముద్రింపించి మనకు అందజేసి యున్నారు!వీరు మరిన్ని ఎక్కాల పుస్తకాలను మరిన్ని ఎక్కువ ఎక్కములతో ముద్రింపించి గణిత సేవకులలో అగ్రగణ్యులుగా నుందురు గాక! అని ఆశించుచున్నాను__ఆశీర్వదిస్తున్నాను!!

Saturday 3 March 2018

కుడి ఎడమైతే

. .  . .  సరదా కబుర్లు
 . . . . . . . ___________
కవుల కవిత్వమంతా నిజమేనా!ఏమో!
కవులు కల్పన చేయడంలో ఘటికులు!వారి కవిత్వంలో కల్పనలూ వుండవచ్చు!
అతిశయోక్తులూ వుండవచ్చు!
వర్ణనలూ వుండవచ్చు!
అతిశయోక్తులూ వుండవచ్చు!
ఉదాహరణకి......కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! అన్న పాట తెలుసుగా!
నిజ్జంగా కుడి ఎడమైతే పొరబాటు లేదంటారా?
మగవారి సంగతి చూద్దాం!
అద్దం ముందు నిలబడండి!
కుడి వైపుకు దువ్వుకొనేవారు ఎడమ వైపుకి,ఎడమ వైపుకి దువ్వుకొనేవారు కుడి వైపుకి దువ్వుకొని చూడండి! తేడా లేదూ!
 . .  . . మీ చొక్కా జేబు ఎడమ వైపు కాక కుడివైపు కుట్టించుకొని చూడండి!అసౌకర్యం కాదూ!
ప్యాంటుకి వెనక జేబు కుడి వైపు పెట్టించుకొని చూడండి!
చొక్కా గుండీలు కుడివైపు వాటిని పెట్టుకొనే రంధ్రాలు ఎడమకి వుంటాయి!మార్చి చూడండి!
అంతెందుకు!కుడికాలి చెప్పు ఎడమకి, ఎడమకాలి చెప్పు కుడికీ వేసుకోగలరా?
ఆడవారి సంగతీ చూద్దాం!
అకస్మాత్తుగా మీఆవిడ పైట ఎడమ వైపు కాక కుడి వైపు వేసుకొని కనిపిస్తే ఎలావుంటుది? ఆవిడ ముక్కు పుడక కుడి ఎడమలు తారు మారైతే మీకు తేడా తోచదూ!
చీర కుచ్చిళ్లు ఎడమవైపుకి వచ్చేలా కాక కుడి వైపుకి వచ్చేలా దోపిందనుకోండి!ఎలా వుంటుంది?
అంతెందుకు పెళ్లి పీటల మీద వధూవరులకి బుగ్గన చుక్క పెట్టడానికి కూడా పద్ధతుంది కదా!
అమ్మాయిని అబ్బాయికి ఎడమవైపే కూర్చోబెడతారుగా!అందులోనూ బుుగ్వేదులయితే అబ్బాయికి కుడివైపు కూచోబెడతారు! తారుమారైతే పంతులుగారు వూరకుంటారూ?
అంతెత్తున లేవరూ?
కుడి చేత్తో రాసినట్టు ఎడం చేత్తో రాయగలమా!ఎడమ చేతి వాటం గలవాళ్లని కుడి చేత్తో రాయమనండి చూద్దాం .
అసలు కొన్ని పనులు ఎడమ చేత్తోనే చేయాలిగా!కుడి చేతితో చీదగలమా?
 .   ఇప్పుడు చెప్పండి!
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ అంటే ఒప్పు కుందామా!
పోనీ లెండి!పాట పాడింది తాగుబోతు కదా!అలాంటి వారికి కుడి ఎడమలు తెలిసి ఏడుస్తాయా అంటారా!
సరే అయితే!
....................కోడూరి శేషఫణి శర్మ