Saturday 17 March 2018

బుద్ధిమంతులు

బుద్ధిమంతులు ఎలా కాలం వెళ్లబుచుతారో యీ శ్లోకం చదివితే తెలుస్తుంది:

ప్రాతర్ద్యూత ప్రసంగేన
మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః
రాత్రౌ చోర ప్రసంగేన
కాలో గచ్ఛతి ధీమతాం।।
           
              బుద్ధిమంతులు ప్రాతఃకాలములో జూదానికి సంబంధించిన విషయాలను, మధ్యాహ్నం స్త్రీకి సంబంధించిన విషయాలను, రాత్రి చోరులకు సంబంధించిన విషయాలను గురించి మాట్లాడుకుంటూ కాలం గడుపుతారట!
 . . . . . . . . భలే వుంది కదా!
జూదము,స్త్రీ,దొంగతనము గురించి మాటలాడుతూ రోజంతా గడిపేవాళ్లు బుద్ధిమంతులేనంటారా?
              చూద్దాం:
జూదం ప్రముఖ పాత్రవహించి నడచిన కథ ...భారతం!భారతంలో లేని ధర్మాలు లేవు!
ప్రాతఃకాలములో అంటే జీవితం తొలిదశలోనే అన్ని ధర్మాలను ఆకళింపు చేసుకోవాలి!అంటే భారతం గురించి మాట్లాడుకోవాలన్న మాట!
           మధ్యాహ్నకాలం అంటే జీవితం రెండవ దశ!సంసారము,సంతానము,వారసత్వము మొదలైనవి అనుభవించేకాలం!
లోకంలో కైకేయి లాంటివారుంటారు! శూర్పనఖ లాంటి వారుంటారు! సీతలాంటివారూ వుంటారు!
ఆయా కష్టనష్టాలు, సుఖదుఃఖాల గురించి అవగాహనకోసం రామాయణాన్ని చదవాలి!
           రాత్రి అంటే జీవితంలో వృద్ధాప్యం!
అన్నీ అనుభవంలోకి వచ్చేసి వుంటాయి!మంచీ చేడూ చూచి వుంటారు.సంసార తాపత్రయంలో పడి దేవుడు దైవము ఆత్మ పరమాత్మ వగైరా గురించి పట్టించుకొనక పోయివుండవచ్చు!అన్ని బాధ్యతలు తీరినతరువాతనైనా, బాధ్యతలు వదలింకొని అయినా పారమార్థిక దృష్టికి మరలాలి!అందుకు భాగవతం చదవాలి భక్త మానసచోరుడూ శ్రీ కృష్ణుడు కదా!అదే చోర ప్రసంగం!
             అదీ వరస.....
భారత రామాయణ భాగవత చర్చలతో బుద్ధిమంతులు కాలం గడపాలని జీవితం సుగమం చేసుకోవాలనీ వాళ్లే . బుద్ధి మంతులనీ . తాత్పర్యం!
     
 . . . . . . . . కోడూరి శేషఫణి శర్మ!

No comments:

Post a Comment