Thursday 8 March 2018

. . . . . . . . . సరదా కబుర్లు
 . . . . . .  . . . ____________
  కుచచేలోపాఖ్యానం:
                   ఏమిటి ?శీర్షికలో పొరబాటు అనుకుంటున్నారా? అచ్చంగా యిది కుచచేలోపాఖ్యానమే! కుచేలోపాఖ్యానం అందరికీ తెలిసిందే! ఇదీ అంతే ! కుచచేలమండీ!అంటే పైట కాదా!
                 పైటను తగలెయ్యాలి.....అని ఆ రచయిత్రి ఎవరో అన్నారు గానీ పైటలోని అందం,సుఖమూ,సౌకర్యముా పైట వేసిన వారికే తెలుస్తుందని 
పెద్దల ఉవాచ!
                     పైటలో ఎంత ఆకర్షణ వుందో చేతికందిన తువ్వాలు గుడ్డను పైటలాగా వేసుకొని ఆరిందాలా తిరిగే ఆరేడేళ్ల అమ్మాయిని చూస్తే తెలుస్తుంది!
                  పైట పరికిణీలో కనిపించే యుక్త వయస్కురాలి అందమే అందం! పైట వేసుకున్న యింతులు జడలో బంతిపువ్వుతో గొబ్బిళ్ల చుట్టూ గెంతులు వేస్తుంటే ముచ్చటే కదా!
             ఫ్యాషన్ ముదిరి చున్నీ చుడీదార్ అంటున్నారు గానీ చున్నీకి పైటకూతేడా ఏదీ?
స్త్రీ అందాన్ని గౌరవంగా దాచడానికి చున్నీ అయినా పైట అయినా ఒకటే కదా!
                  అసలు పైట గొప్పదనమేమిటి? పైట కొంగు భుజాలనిండుగా కప్పుకున్న పెద్ద ముత్తైదువ కనబడితే చేతులెత్తి మొక్కాలనిపించదూ!పల్లె పడతులు ఒకమాదిరిగా కట్టిన పైటలో చంటిపిల్లను వీపున మోస్తూ పొలం పనులకు వెళుతుంటారు కదా!
                     అంతెందుకు? బయట అలసి సొలసి వచ్చిన శ్రీవారికి మంచి నీళ్లిచ్చి పైటకొంగుతో విసిరి చూడండి!ఆమురిపెమే వేరు!
                     కరెంటు పోయి ఉక్కపోతగా వుంటే విసనకర్ర అందుకొనే ఓపిక లేక పైటతో విసురుకోవడంలో హాయి లేదూ!
                 సాయంకాలం పెరట్లో మల్లెలు గిల్లి పైటలో వేసుకొచ్చి మాలకట్టుకోవడం లేదూ!
             తడిచేయి తుడుచుకోవడానికి తటాలున చేతికి దొరికే తుండు పైటే కదా!
                 కొంతమంది మగవాళ్లకి పైరగాలి ఎంత యిష్టమో పైట గాలీ అంతే యిష్టం!అందుకే ఓ పాత సినిమాలో' కొమ్ములు తిరిగిన మగవారు మాకొంగు తగిలితే పోలేరు' అని ఓపాటను జనంలోకి వదిలారు.వెనుకటి కాలంలో పిక్కల దాకా వుండే పైట ప్రస్తుతం నడుము దగ్గర తారట్లాడుతూంది.
 . . . . . . . . . . . . . ఆడవాళ్ళకి కోపమొస్తే కొంగు విదిలించి లేచిపోతారు.కోపమూ దుఃఖమూ వస్తే ముక్కూ మూతీ తుడుచుకుంటారు!
                     పైట వలన అన్ని సౌఖ్యాలు సౌకర్యాలూ వున్నాయి మరి!
కొస మెరుపు:
      శతావధాని గండ్లూరి దత్తాత్రేయ శర్మ గారి అష్టావధానం!అప్రస్తుతాంశంగా
కుచేలోపాఖ్యానం చదివే వుంటారు!కుచచేలోపాఖ్యానం చదివారా!అని అడిగాను
 . . . . . . . . . మరుక్షణంలో" "సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్......"అంటూ అందుకున్నారాయన.
   ఒౌను! శ్రీ హరి కూడా శ్రీలక్ష్మి కొంగు పట్టుకొని తిరిగేవాడే మరి!
...............కోడూరి శేషఫణి శర్మ

No comments:

Post a Comment