Saturday 24 March 2018

మహాభారత యుద్ధం--రైతు సందేహం

సరదా కబుర్లు
-------------------
భారత యుద్ధం- రైతు సందేహం!
                 లక్ష్మీ పతి శాస్త్రి పేరు మోసిన పౌరాణికుడు!
అష్టాదశ పురాణాలు ఆయన జిహ్వాగ్రంలోనే వుండేవి! దేనిలో ఏ సందేహం వచ్చినా తీర్చడానికి ఆయనే పెద్ద దిక్కు!
    ఎప్పుడో గ్రామంతరం వెళితే తప్ప ప్రతి దినము రచ్చ బండ మీద పురాణశ్రవణం జరగనిదే గ్రామ ప్రజలకు తోచదు!
                   శ్రోతలకు వచ్చే సందేహాలకు శాస్త్రి గారు అక్కడికక్కడే సమాధానమిచ్చేవారు!
            ఈ క్రమంలో మహా భారతం పురాణం జరుగుతూంది! కథ ఒక్కో పర్వము పూర్తయింది.యుద్ధం అనివార్యం అయింది.పెద్దల మంచి మాటలేవీ పని చేయలేదు!
              కౌరవుల వైపు పదకొండు అక్షౌహిణులు,పాండవుల వైపు ఏడు అక్షౌహిణులు సిద్ధమయ్యాయి!  ......అంటూ చెప్పు కొస్తున్నారు  శాస్త్రి గారు!
        అయ్యా! అక్షౌహిణి అంటే ఏమిటి?.....ఒక రెడ్డి గారికి సందేహం వచ్చింది!
                  శాస్త్రిగారు యిలా వివరించ సాగారు...
            రెడ్డి గారుా! సైన్యంలో చతురంగ బలాలు వుంటాయి!అంటే . రథ గజ తురగ పదాతి దళాలన్న మాట!
           21,870---రథాలు
 . . .  .  21,870---ఏనుగులు
 . . . . . . 65,610--గుర్రాలు
 . . . . . 1,09,350--సైనికులు
కలిస్తే ఒక అక్షౌహిణి అన్న మాట! ఇలాంటివి పదకొండు కౌరవుల వైపు ,ఏడు పాండవుల వైపు తలపడినాయి..అన్న మాట! అన్నారు శాస్త్రి!
             మరో  రైతు లేచాడు!
   ఏమిటి సుబ్బారెడ్డీ? నీసందేహం ఏమిటి?..అడిగారు శాస్త్రి!

         అయ్యా! నాకు కాడెద్దులుా,రెండు బర్రెలుా,ఒక ఆవూ వున్నాయి! వాటిని కట్టేసుకోడానికే స్థలం చాలడం లే.మేపూ చాలడం లే! వాటిని మేపడానికి తోలుకు పోయే పిలగాడూ దొరకడం లేదు!నేను పొలానికి పోతే వాటి ఆలనా పాలనా చూడడానికి మా యింటి దానికి పొద్దు సరిపోవడం లేదు......
              ఇంతకీ ఏమంటావు రెడ్డీ?....అడిగారు శాస్త్రి!
             అదే నయ్యా! రెండు మూడు గొడ్లతోనే మాకింత యాతనగా వుందే!  మీరేమో . అక్షౌహిణీలని వేల రథాలు,వేల గుర్రాలు,వేల ఏనుగులు అంటున్నారు!అన్నింటి కట్టేయడానికి ఎంత స్థలం కావాలె?ఎన్ని గొలుసులు గావాలె? ఎంత మేత గావాలె?
సైనికులకు వండి పెట్టడానికి ఎంత మంది వంటవాళ్లు గావాలె!వండడానికి ఎన్ని బండ్ల వంట చెరుకు గావాలె?ఎన్ని బియ్యం,ఎన్ని కూరగాయలు,ఎన్ని నీళ్లు,ఎన్ని పాత్రలు గావాలె?ఒక్క చోట యిదంతా అయ్యే పనేనా అయ్యా! ...అన్నాడు రెడ్డి!
           అయ్యగారు ఆలోచిస్తున్నారు!
         తన సంసారంతో పోల్చకొని లెక్క కట్టబోయిన రెడ్డికి పెద్ద సందేహమే రాదగిన సందేహమే వచ్చింది కదా!

        -----కోడూరి శేషఫణి శర్మ

2 comments:

  1. నిజమే!
    అసలు సీసలు డౌటు - యుద్ధారంగంలో వీటిని యుద్ధ వ్యూఒహానికి అనుగుణంగ మొహరించడానికి ఎంత స్తలం గావాలె?కురుక్షేత్రమనే యుద్ధరంగమలో ఇంత స్తలం ఉండెనా?
    అద్గదీ పాయింటు!ఎవరు జవాబు చెప్తారు?

    ReplyDelete

  2. శేషఫణి శర్మ గారూ, మీ సందేహం గురించి “కష్టేఫలే” శర్మ గారు తన బ్లాగ్ లో వ్రాసిన “ శర్మ కాలక్షేపంకబుర్లు-18 అక్షౌహిణిలసేన-అయ్యబాబోయ్! “ (మార్చ్ 29, 2018) అనే టపా చూడండి.

    https://kastephale.wordpress.com/2018/03/29/శర్మ-కాలక్షేపంకబుర్లు-18-అ/

    ReplyDelete