Wednesday 14 March 2018

భుజాలు తడుముకుందాం!

. . . . . .  . భుజాలు తడుముకుందాం
_________________।_
                 మేము తెలుగు వాళ్ళం!అవును...మేము తెలుగు వాళ్లం!
                   వేకువనే లేచే అలవాటు మాకు లేదు.అర్లీ మార్నింగ్ మాత్రమే లేస్తాం!పళ్లు తోముకొనే అలవాటు లేనే లేదు.బ్రష్ చేసుకుంటాం! అవును...చెప్పలేదు కదూ....మాకు పడగ్గదులు లేవు...ఉన్నవన్నీ బెడ్ రూమ్సే!
                   ఉపాహారమంటే మాకు యిష్టం వుండదండీ! ఎయిటో క్లాక్కి టిఫిన్ తింటాం!  మా పిల్లలని బడికెందుకు పంపుతాం! స్కూళ్లకే పంపుతాం!పెద్ద పిల్లల్ని కాలేజీలలకే పంపుతాం!
కళాశాల అంటారట కానీ అదేమో మాకు తెలియదు!
                      మధ్యాహ్నం మీల్స్ చేస్తాం! కాకపోతే లంచ్ అయినా చేస్తాం కానీ భోజనం అసలు చేయం!
                     ఈవినింగ్ చిరుతిండ్లు లాంటివి నచ్చవు. పిల్లలతో బాటు స్నాక్స్ తీసుకుంటాం!
                    మా పిల్లల్ని చిల్లరగా ఆటలాడనివ్వం!గేమ్స్ ఆడుకొమ్మంటాం!
                    నైట్ ఎయిటోక్లాక్కి డిన్నర్ ముగిస్తాం!చాదస్తులు మధ్యాహ్నం డిన్నరనీ,నైట్ సప్పర్ అనీ అంటారట! మాకేమో లంచ్, డిన్నరే అలవాటు!
                         మా ఆడ వాళ్లంతా శారీస్ కట్టుకొని జాకెట్ వేసుకుంటారు! ఈ కాలంలో చీర, రవికె ఏం బాగుంటాయి? చెప్పండి!
                         తెలుగు . .  తెలుగు .  . అని పెద్దలంతా అంటారు గానీ మేం యింత దాకా చెప్పింది తెలుగులో కాదూ! మేం తెలుగు వాళ్లం కాదూ! కాదంటే మాకు ఐస్ లో వాటరొచ్చేస్తుంది!మరీ నీచంగా కన్నీళ్లు రావడం బాగుండదు కదా! మీరు అవునంటే కాస్త స్మైల్ చేస్తాం! చిరునవ్వుల చాదస్తాలు మాకు లేవు!
                  అవును....చాదస్తానికి ఇంగ్లీషు వర్డ్ ఏమిటో ఎవరయినా చెప్పరూ!
                    ఏమిటో యింకా చాలా చెప్పాలని వుంది కానీ మీకు బోరు....అదేనండీ....విసుగో...ఏదో ...అంటారే అది వస్తుందేమో! టుమారో....లెటజ్ మీట్!! ఓ కే . నా?

                 కోడూరి శేషఫణి శర్మ..

No comments:

Post a Comment