Friday 23 March 2018

తాతా ఊతునా!

తెనాలి రామకృష్ణుడు చాటువులు ఎన్నో చెప్పాడు!
ఆయన పైన కూడా చాటువులున్నాయి!
 . .  నంది తిమ్మనకు ముక్కు తిమ్మన అని కూడా పేరుంది!
ముక్కు మీద మంచి పద్యం చెప్పినందుకు ఆ పేరొచ్చిందట!
   సరే!ప్రస్తుతానికి వద్దాం!
 . . ముక్కు తిమ్మన ఇంటి దారిగుండా రామలింగడు వెళుతున్నాడు!
భోజనం చేసి నోటి నిండా తాంబూలంతో వున్నాడు!
తిమ్మన తన యింటి వసారాలో భోజనానంతర విశ్రాంతి తీసుకుంటూ ఊయల మంచం మీద ఉన్నాడు!
           చిలిపి రామలింగడికి ఒక పనికి మాలిన చిలిపి ఊహ వచ్చింది! వెంటనే తిమ్మన దగ్గరకు వెళ్లి '' తాతా! ఊతునా? " అన్నాడు
 . . . . . ఊయల ఊపుతాడేమోనని తిమ్మన " ఊఁ " అన్నాడు.
          వెంటనే రామలింగడు తుపుక్కున ఊశాడు! ఆ తుంపుర్లు తిమ్మన పైన పడ్డాయి!కోపంతో తిమ్మన కాలు ఝాడించాడు! కాలు తగిలి రామలింగని నోటి పల్లు వూడింది!
           మరుసటి దినం రాయల వారు .  . రవి గాననిచో కవిగాంచునే కదా!
అనే సమస్య పూరించమని ఇచ్చారు!
           అప్పుడు ధూర్జటి మహా కవి యిలా పూరించాడు

ఆ రవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసి నోటికిన్
నేరడు!రామలింగ కవి నేరిచెబో మన ముక్కు తిమ్మన
క్రూర పదాహతిన్ తెగిన కొక్కిర పంటికి దుప్పి కొమ్ము ప
ల్గా రచియించినాడు!రవి గాననిచో కవి గాంచునే కదా!

         రామలింగడు బోసినోరు కనపడకుండా దుప్పికొమ్మును అరగదీసి పంటి స్థానంలో అతికించుకొని వచ్చి కూర్చున్నాడట!
అది కనిపెట్టిన ధూర్జటి అలా సమస్య పూరించాడట!
          దక్ష యజ్ఞం ధ్వంసం చేసే సమయంలో వీరభద్రుని దెబ్బకు సూర్యునికి పల్లు వూడిందట!కానీ సూర్యునికి రామలింగనిలా ఉపాయం తోచలేదు! రవి కి తోచని ఉపాయం కవి రామలింగనికి తోచింది!
          ఆ విషయం మరో మహాకవి ధూర్జటికి తెలిసింది మరి!
కథలో నిజమేమో గాని మంచి పద్యం రూపొందింది!

No comments:

Post a Comment