Friday 16 March 2018

వెర్రి వేయి విధాలు

సరదా కబుర్లు
----------------+++

                వెర్రి వేయి విధాలు
              ---------------------------

వెర్రి వేయి విధాలన్నారు!ఆ విధాలనన్నిటిని ఏకరువు పెట్టమంటే యిక్కడ సాధ్యం కాదులెండి!
               అదేమిటో? వెధవ పనులకు సవాలక్ష మార్గాలుంటాయి కానీ మంచి వాటికి మాత్రం చాలా తక్కువ మార్గాలుంటాయి!అంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చునన్నమాట!
     
         భక్తి చూడండి! కేవలం నవ విధ భక్తులు! అంటే మన భక్తిని చాటు కోవాలన్నా,భగవంతుని పట్ల భక్తి తత్పరతతో వుండాలన్నా తొమ్మిది మార్గాలే!
              ఒకటి వీలు కాకపోతే మరొకటి....తొమ్మిది మార్గాలున్నాయి కదా అని ఆశా వాద భక్తులు తృప్తి పడుతుంటారు!
           సరే నయ్యా! ఆ తొమ్మిది ఏవేవో చెప్పరాదూ...అంటారా? అవేనండీ...శ్రవణం,కీర్తనం,స్మరణం,పాదసేవనం ,అర్చనం,వందనం,ధ్యానం,సఖ్యం,ఆత్మ నివేదనం.....
             భగవంతుడు ఎంత భక్త సులభుడు! ఇవి కూడా చేత గానివారిని ఏ దేవుడూ ఏమీ చెయ్యలేడు!మనం మాత్రం ఏం చేస్తాం!
                పైన చెప్పిన తొమ్మిది మార్గాలు కాక మరో మార్గాన్ని వెదికారు కొందరు!
తామే ఫలానా దేవుడికి భక్తులమనీ,ఆ ఫలానా దేవుడిని గూర్చి భయపెట్టి యితరులను కూడ ఆ దేవుని తలచు కొనేట్టు చేయాలనీ వెర్రి మార్గాన్ని కని పెట్టారు!అంటే వెర్రి భక్తి అన్న మాట!ఇదీ నవ విధ భక్తులకు తోడు పదవ భక్తి!
        ఎక్కడో ఎవరో ఒక దేవుడు ఎవరో ఒకరికి కలలో కనబడి తనగురించి పాతిక మందికి ఉత్తరాలు రాయమన్నాడట!అలా రాస్తే ఊహించనంత మేలు జరిగిందట!ఉత్తరం అందుకున్నవారు కూడా అలా రాయాలట! రాయని వారికి నష్టం జరుగుతుందట!
            ఇదీ వారి వెర్రి భక్తి!
భయపెట్టి దేవుని గురించి ప్రచారం ఏమిటో అర్థం కాదు!
           అసలు భగవంతుడు భయాన్ని పోగొట్టేవాడా?భయాన్ని కలిగించే వాడా?
             భయాన్ని కలిగించే వాడైతే రాక్షసుడు గాని దేవుడెలా అవుతాడు!
            ప్రజలను భయపెట్టిన రాక్షసుల పని పట్టడానికి కదా భగవంతుని అవతారాలన్నీ!ప్రతి అవతార లక్ష్యం అదే కదా!
మరి యిలా దేవుడి పేరు మీద భయపెట్టే ఉత్తరాలు రాసే వారు ఎవరు?అలా భయపెట్టే వారిని భగవంతుడు వూరికే వదిలేస్తాడా!  ఓరి భడవా !నా పేరుతో అమాయకులను భయపెడతావా!అని వారి భరతం పట్టడూ!
         ఎందుకు పట్టడండీ?ఏదో ప్లాను వేస్తూనే వుంటాడు!

భయపెట్టే వారి భరతం పట్టడానికే భగవంతుడున్నాడు!!!!

  ---------కోడూరి శేషఫణి శర్మ

No comments:

Post a Comment