Monday 19 March 2018

భోజన పరాక్రమం

. . . . .   . సరదా కబుర్లు
 . . . . . _______________

. . భోజన పరాక్రమం:
__________________
                        ఈ కాలంలో నాజూకుతనం మరీ మితి మీరి పోయింది!
               మంగళ హారతి కళ్లకద్దుకుంటే . వేడి చేస్తుందనీ, తీర్థం పుచ్చుకుంటే శీతం కమ్మేస్తుందనీ వయ్యారాలు పోయే వాళ్లున్నారు! తిండి దగ్గర మరీ నాజూకుతనం!ముని వేళ్లతో కెలికి తినేవారు కొందరైతే స్పూన్తో సుతారాంగా తినేవారు మరికొందరు!
                    డైటింగ్ చేసేవారేగానీ భోజన పాత్రమీద ఫైటింగ్ చేసే వారేరీ?
                    అందుకే అన్నింటా నీరసాలూ,ఉసురుసురూలూ!
                    రెండు మూడు దశాబ్దాల క్రితమేమో ఆడవాళ్లు ఏడెనిమిది గజాల చీరలు ధరిచేవారు!వారికేమీ భారమనిపించేదే కాదు .ఇప్పుడో! ఏడెనిమిది మూరల గుడ్డ కూడా బరువే!
పిదప తిండి తినే కొద్దీ గుడ్డ కురచ అయి పోవడం లేదూ!
ఆఖరికి కొప్పు బరువై కురచ కురుల కులుకులు చూడడం లేదూ!
              పోనీ బాగా తిందామని వున్నా వడ్డించే వారేరీ?  ఇళ్ళల్లో కూడా బల్ల భోజనాలేనాయే! ఉరుకులు పరుగులేనాయె!తినేదెప్పుడు? అరిగే దెప్పుడు?
                    పెళ్లిళ్లకీ పేరంటాలకీ వెళ్లినప్పుడయినా వడ్డన ఎక్కడుంది?
మీరు బంతి కూచోండి !మేం వడ్డిస్తాం అనే వాళ్లెవరున్నారు?
ఆ బకెట్లు, తపేలాలు మోయడం మాతో కాదు బాబూ!అనేవారేగా అంతా!
అంత నాజూగ్గా తయారయ్యాం మరి!
               అలా యిలా ఏదోలా
బఫే పద్ధతొకటి వచ్చింది! ఆహో! మొదటి పది పదిహేను నిమిషాలు ఎంత క్రమశిక్షణో?
అలా సాగితేయింకేం? భారతదేశం అగ్రరాజ్యమై పోదూ! ఎవరి తొందర వారిది!ముందొకరుండగనే వారి భుజంమీదుగా ఎంగిలి పళ్లెం చాపి సాంబారో రసమో పోయించుకుంటారొకరు!
 . . . . . . . ప్రతి పదార్థం దగ్గరికీ వెళ్లి అడిగి వేయించుకుంటుంటే.....ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతీ....అని గుర్తొస్తుంది!
               టేబుల్ దగ్గరనుండి కదలకుండా అక్కడే ఆబగా కూరుకొనే వారొకరైతే,ఎవరికీ సంబంధం లేకుండా దూరంగా నిలబడి జుర్రుకొనే వాడొకడు!
                కబుర్లాడుకుంటూ,పరాచికాలడుతూ కావలసింది అడిగి వేయించుకుంటూ బలవంతంగా వడ్డిచేవారిని చేతులడ్డుపెట్టి వద్దంటూ చేసే భోజన పంక్తులేవీ?ఆ భోజన పరాక్రమమేదీ?
                    తిండికలిగితె కండ కలదోయ్! కండ గలవాడేను మనిషోయ్! అన్న కవి వాక్కులు నిజం చేసే సంఘటనలూ సందర్భాలూ ఏవీ?
                 ఒక్కో ముద్దా తాటికాయ ప్రమాణంలో లాగించే రామయ మంత్రి లాంటి వారిని యిక చూడగలమా?  శ్రీ నాథ మహా కవి ఆటపట్టిస్తూ రామయమంత్రి పై చెప్పిన పద్యం గుర్తుకోవడం తప్ప!

గ్రామము చేతనుండి పరికల్పిత ధాన్యములింట నుండి శ్రీ
రామకటాక్ష వీక్షణ పరంపరచే గడ దేరెగాక!మా
రామయమంత్రి భోజన పరాక్రమమేమని చెప్పవచ్చు నా
స్వామి యెరుంగు తత్కబళ చాతురి తాళ ఫల ప్రమాణమున్!

              కోడూరి శేషఫణి శర్మ

10 comments:

  1. బాగా చెప్పారు. అయితే తెలుగు భాష గురించిన మీ ఆదుర్దాను మీ బ్లాగులో (ఉదా :- “భుజాలు తడుముకుందాం!” అనే 14-మార్చ్-2018 టపా) చూపించే మీరు కూడా “సాంబారు”, “రసం” అంటే ఎలా శేషఫణి శర్మ గారూ? ఎలాగూ కేటరింగ్ వాళ్ళ బారిన పడి భోజనపదార్ధాల తెలుగు పేర్లు దాదాపు మాయమైపోయాయి. స్టైల్ అనుకుంటారేమో గానీ “పులుసు”, “చారు” లాంటి తెలుగు పేర్లు పలికేవారే తక్కువైపోయారు - ఇంట్లో భోజనాల దగ్గర కూడా. సర్లెండి, పిల్లలకే సాంప్రదాయ పేర్లు పెట్టడం బాగా ... బాగా ... తగ్గిపోయింది, ఇక ఆహారపదార్ధాల పేర్ల గతి ఎవరు పట్టించుకుంటారు? కేటరింగ్ వాళ్ళు, టీవీ వంటల కార్యక్రమాల వాళ్ళు పలికిందే వేదం 🙁.

    ఒక సంఘటన గురించి చెబుతాను. 15 రోజుల క్రితం స్నేహితుడింట్లో ఒక శుభకార్యక్రమానికి వెళ్ళాను. భోజనాలప్పుడు పదార్ధాల బల్ల దగ్గరకు వెళ్ళి అక్కడున్న కేటరింగ్ యువకుడితో పులుసు వెయ్యమని అడిగాను. పులుసు లేదండీ అన్నాడు. నేను కించిత్తాశ్చర్యపోయి, బల్ల మీదున్న ఒక పెద్ద గిన్నె వైపు చూపించి అది పులుసేగా అన్నాను. అది పులుసు కాదండీ, సాంబార్ అన్నాడు ఆ కేటరింగ్ మహాశయుడు. నా జన్మ ధన్యమైందనుకున్నాను 🙏.

    అన్నట్లు బఫే భోజనాన్ని (దీన్ని “బుఫే” అని పలకాలంటారు కొందరు) “పనిలేక” బ్లాగర్ డాక్టర్ రమణ గారు “బొచ్చెభోజనం” అనేవారు తన బ్లాగ్ టపాల్లో 😀.

    ReplyDelete
    Replies
    1. నరసింహారావు గారూ,
      సాంబారు వేరు, పులుసు వేరు కదా ?
      కూరముక్కలు వేసి పప్పుతో చేసేది సాంబార్!
      పప్పులేకుండా కూర ముక్కలతో చింతపండు పులుసు కలిపి చేసేది పులుసు.
      పెళ్ళిళ్ళలో సాంబారు మాత్రమే చేస్తారు.

      Delete
    2. రైట్. వివరించినందుకు ధన్యవాదాలు నీహారిక గారూ. అయితే నా బాధల్లా పిలిచే పేర్లు, మాయమవుతున్న తెలుగు పేర్ల గురించి.

      మీరన్న పప్పు కూడా వేసి కాచిన పులుసుని పప్పుపులుసు అంటారని మా చిన్నతనంలో పెద్దవాళ్ళు చెప్పారు. అలాగే పిలిచేవాళ్ళం కూడా, మా తరం వాళ్ళయితే ఇప్పటికీ ఆ పేరే అలవాటు. ఆ రోజుల్లో పెళ్ళిళ్ళల్లో కూడా పులుసు / ముక్కలపులుసు (కొన్ని చోట్ల దప్పళం అనీ) అనేవారనే జ్ఞాపకం మరి.

      అయితే పప్పు వెయ్యకుండా తయారు చేసిన పులుసును కూడా - తేడా తెలియకుండా - సాంబారు అనే అంటున్నారు ఈ రోజుల్లో ..... ఇళ్ళల్లో కూడా. ఆ పేరే స్ధిరపడిపోయినట్లుంది తెలుగు పేరును వెనక్కి నెట్టేసి. అదీ ... నా అసలు పాయింట్ మరియు విచారం.

      (అయినా మనం మనం ఒకే జిల్లావాళ్ళం కదా, ఒకే మాట మీదుండాలి 😀 jk)

      Delete
    3. మా పల్లెలో గోపాలుడు సినిమా వచ్చిన తరువాత పులుసు అన్న పదం వాడడం అవమానకరంగా ఉంది అని భావన.జిల్లాల ఊసెత్తకుండా అందరితో కలిసిపోవడమే మన జిల్లా ప్రత్యేకత !ఆ విధంగా ముందుకుపోదాం.

      Delete

    4. విన్నకోట వారికి ఇవ్వాళ గిట్టుబాటు లే :)
      జిల్లా లాజిక్కూ బెడిసె :)

      Delete
    5. ప్చ్, అవునండీ, ఒక్కోరోజంతే. ఇవాళ పొద్దున్న లేచిన తరువాత ముందర నా మొహమే చూసుకున్నట్లున్నాను 😪.

      Delete
  2. హేవిటో,విన్నకోట వారూ నీహారిక గారూ తిండి మీద పడ్డారు!
    మా బంగార్మ్ ఏం పెడితే అది తినదం తప్ప నాకు అది తినాలి ఇది రుచి చూడాలి అనే తిండియావ అస్సలు లేదు.
    రామయమంత్రి కాబ్ళ చాతురి గురించి మ అమామయ్య చెప్పగ అరెందో భాగమే విన్ననౌ చిన్నప్పుడు.పూర్తి పద్యం ఇప్పుడు ఇక్క్కడ దొరికింది - భలే పద్యం:-)

    ReplyDelete
    Replies
    1. ఇదేమి తెలుగురా బాబోయ్ !

      Delete
  3. హరిబాబు గారూ, ప్రతి మగాడికీ తన ఇంటిబంగారం ఏం చేసి పెడితే అది తినడం వినా మార్గం లేదు కదా. అలా కాక ... అది చేసి పెట్టు, ఇలా చేసి పెట్టు అని పట్టుబడితే ఉద్దాలకుడు-చండి సంసారం లాగా తయారవచ్చు. కాబట్టి మగవాడెన్నుకునే ఈ శాంతిమార్గానికీ, తిండియావకీ సంబంధం లేదు స్వామీ.
    అయినా పైన నేను వ్రాసిన వ్యాఖ్యల్లో నా ఘోషంతా తిండిపదార్ధాల యొక్క తెలుగు పేర్లు అంతరించిపోతున్నాయనే గానీ, as such ఆ పదార్ధాల గురించి వాటి రుచి గురించి కాదని మరోసారి మనవి చేస్తున్నాను.
    ప్చ్, “జిలేబి” గారన్నట్లు ఇవాళ గిట్టుబాటవలే 🙁

    ReplyDelete
    Replies
    1. ఆహా ! జిల్లా కార్డు మేల్ కార్డ్ అయిపోయిందన్న మాట :)

      నారాయణ నారాయణ :)


      జిలేబి

      Delete