Monday 2 April 2018

హంస-కొంగ

 
       హంస,కొంగ...రెండూ పక్షి జాతికి చెందినవే! అయినా హంస హంసే!కొంగ కొంగే! దేని లక్షణం దానిదే!
       మనుషులూ అంతే కదా! అందరూ మనుషులే అయినా ఎవరి లక్షణం వారిదే!ఎవరి సంస్కారం వారిదే!
         సంస్కారాన్ని బట్టి వారి మాట తీరు,ప్రవర్తన వుంటుంది!ఎదుటి వారి మాట పట్ల స్పందన కూడా అలాగే వుంటుంది!
          కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు యీ విషయాన్ని చాలా అందంగా సున్నితంగా కొంగ-హంసల మధ్య సంభాషణగా పద్య రూపంలో చెప్పారు"
     చూడండి:
          కొంగ అడుగుతూ వుంది....హంస సమాధానం చెబుతూ వుంది

       ఎవ్వడ వీవు?కాళ్లు మొగ మెర్రన!
                                                    హంసమ!...ఎందునుందువో?
      దవ్వున మానసంబునను!  దాన విశేషములేమి చెప్పుమా?
    మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు!....నత్తలో?
    అవ్వి యెరుంగ నన్న నహహా యని నవ్వె బకంబులన్నియున్ !

            హంసను చూచిన కొంగ అడిగింది....నీవెెవరవు?కాళ్లు మొగము ఎర్రగా వున్నాయే?
             హంసను!
            ఎక్కడ వుంటావు?
           చాలా దూరంలో మానస సరోవరంలో...
          అక్కడి విశేషాలేమిటి?
         మృదువైన బంగారు పద్మాలు,ముత్యాలు ఆసరోవరంలో వుంటాయి!
         నత్తలో?(కొంగలకు నత్త గుల్లలు యిష్టమైన ఆహారం)
        అవి నాకు తెలియవు!....అనింది హంస!
     నత్తలు తెలియవా?...అని కొంగలన్నీ పరిహాసంగా నవ్వాయట!

ఎవరి దృష్టి వారిది?కొంగల సంస్కారం అంతే!
వాటికి తెలిసింది నత్తలను తినడమే!అవి తెలియని వారు వాని దృష్టిలో
అమాయకులే! బంగారు కమలాలు ముత్యాల వంటి విలువైన వాని గురించి వాటికి పట్టదు!

              మనుషులు కూడా అంతే!వారి పరిధి లోనే ఆలోచిస్తారు!
అవతలివారి విజ్ఞానము తెలివి తేటల గురించి పట్టించుకోరు!
అవతలి వారి గూర్చి తెలుసుకొనేవాడు,తెలుసుకోవాలనుకొనే వాడు
తెలివిగల వాడిక్రిందకే లెక్క!


   -------కోడూరి శేషఫణి శర్మ

       




Sunday 1 April 2018

వర్ల్డ్ టెలుగు కాన్ఫరెన్స్

సరదాకే సుమా
--------------------
          వర్ ల్డ్ తెలుగు కాన్ఫరెన్స్
------------------------------

ఏమోయ్! నిన్న సాయంకాలం మీ యింటి కొచ్చా!
నీవ లేవు!ఏదో హడావిడిలో వున్నవట!ఏమిటి సంగతి?

ఇన్విటేషన్ వచ్చిందోయ్!

దేనికి?

అదే! వర్ ల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ జరుగుతుందిగా!

అవునా?ఏముంటాయి?

డిస్కషన్సు,పేపర్ ప్రజెంటేషన్సు,రిజల్యూషన్సూ చాల వుంటాయి!

ఎవరెవరు వస్తున్నారు?

ఓపెనింగ్ సెర్మనీకేమో వైస్ ప్రసిడెంటు, వాలిడిక్టరీకేమో ప్రసిడెంటూ వస్తున్నారు!
ఇక పోతే తెలుగు పొయెట్స్,రైటర్స్ చాలామందే వస్తున్నారు!

ఇప్పుడంత అవసరమేమొచ్చిందట?

అదేమిటి?కర్నాటక,టమిల్నాడు స్టేట్స్ చూడు!
వాళ్ల మదర్ టంగ్ కి ఎంత ప్రామినెన్స్ యిస్తారో! మనం కూడా అలా వుండాలోయ్!

ఆ వచ్చేవాళ్ంతా ఏంచెబుతారు!?

మన తెలుగుని ఎలా ప్రమోట్ చేసుకోవాలో, కల్చర్ ని, ట్రెడిషన్స్ ని ఎలా కాపాడుకోవాలో చెబుతారు!

నీవేం చేస్తావట?

డైలీ యూజ్ లో తెలుగు ఇంపార్టెన్సు గురించి పేపర్ ప్రజెంట్ చేస్తున్నా!

అంత పెద్ద సభలు కదా!ఏర్పాట్లు అవీ ఎలా వుంటాయో!

అరేంజ్ మెంట్స్ సూపర్ అనుకో?దీన్లో పార్టిసిపేషన్ లైఫ్ టైం థ్రిల్లింగ్!

క్షమించు! ఒక్క మాట చెప్పనా?

మనలో మనకేమిటి? హెజిటేషన్ లేకుండా చెప్పవోయ్!

ఇందాక పేపర్ ప్రజెంటేషన్! డైలీ యూజ్ అన్నవే!ఇప్పుడు నాతో మాట్లాడిన మాటలన్నీ తెలుగు లోకి మార్చి చెప్పెయ్!
అంతకంటే ప్రత్యేకంగా ఏమీ వద్దు!నిత్యకృత్యంగా ఇప్పుడు చెప్పిన మాటల్ని తెలుగులో మాట్లాడు!మాట్లాడమను!
తెలుగు వర్ధిల్లుతంది!

😚😚😚😚

ఏం? తెలుగును ఎలా నిలబెట్టడమో అర్థం అయిందా?

??????

🙏🙏

Thursday 29 March 2018

కన్యా వరయతే రూపం......


    ఈ మధ్య అబ్బాయిలూ ,అమ్మాయిలూ
ఎవరి జోడీ వారు చూసుకుంటున్నారు. నాకు నచ్చినవాడిని నేను చూచుకోగలను అే స్థాయికి అమ్మాయిలు,
నాకెలాంటి అమ్మాయి కావాలో నిర్ణయించడానికి మీరెవరు అని అబ్బాయిలూ అంటున్నారు!
న్యాయస్థానాలు కూడా మేజర్ అయిన వారుతమ వివాహ నిర్ణయాలు తీసుకుంటే ఇతరులు అడ్డు చెప్పడానికి లేదనీ తీర్పు చెప్పాయి.వారి నిర్ణ యాలకు వారే బాధ్యులు!
   
        తల్లిదండ్రుల ప్రమేయంతో జరిగే వివాహాల్లో కన్యకు వరుడిని నిర్ణయించడానిి ఒక పద్ధతి  వుండేది!
అదెలాగో క్రింది శ్లోకంద్వారా తెలుస్తుంది"

     కన్యా వరయతే రూపం
    మాతా విత్తం పితా శ్రుతం
   బాంధవాః కులమిచ్ఛంతి
   మృష్టాన్న మితరే జనాః
         
       అమ్మాయి వరుని రూపాన్ని చూస్తుంది!
     తనకు తగినవాడేనా?తన రూపానికి,అందానికీ సరిపోతాడా అని చూస్తుందట!
        తల్లి వరుని సంపదా ,సంపాదనా చూస్తుంది!అవును మరి అమ్మాకి ఏలోటూ రాకుండా చూచు కొనేవాడు కావాలిగా!
        తండ్రి వరుని గుణగణాలు,నడవడి చూస్తాడు!తీరా పెళ్లి అయాక అన్నీ అవలక్షణాలు కలవాడైతే?అందుకు ఆయన జాగ్రత్త ఆయనది!
       బంధువర్గమంతా తమ కులము వాడా కాదా అని చూస్తారట!

          ఇంతమందీ ఇన్ని జాగ్రత్తలు తీసుకొనేవారు కనుకనే మనువులు దశాబ్దాల తరబడి నిలబడేవి!కాలం గడిచే కొద్దీ అనుబంధం గట్టి పడేది!
       ఇప్పుడో? ఎవరి ఇష్టం వారిది"
         కన్యా వరయతే సాఫ్ట్ వేర్!
        మాతా జీతం! పితా హోదా!
       బాంధవాః గిఫ్ట్స్ ఇచ్ఛంతి!
     పార్టీలనితరే జనాః
 
   వధూ వరులు వారి ఇష్టానుసారం పెళ్లాడి ,విడి పోవడం కూడా అలాగే మాఇష్టం అంటున్నారు
   అందరినీ అలా అనలేము!అనకూడదు! తొందరపాటు నిర్ణయాలు కాకుండా స్థిమితంగా యోచిస్తే మంచిది కదా!
   
    పెళ్లంటే నూరేళ్ల పంట మరి!














Wednesday 28 March 2018

తంజావూరు రఘునాథ రాయల శౌర్యం---స్వర్గంలో రంభకు యాతన

మందపాటి రఘునాథ మహారాజు శౌర్యాన్ని కొనియాడుతూ కవి చెప్పిన రసవత్తర మైన చాటు పద్యాన్ని చూడండి:
         రణరంగంలో పోరాడి మరణించిన వారికి వీర స్వర్గం దక్కుతందనీ,రంభాది అప్సరసల పరిష్వంగ సుఖాలు అబ్బుతాయనీ వాడుక!
        ఆ మాటను ఊతంగా కవి చమత్కరించాడు చూడండి
 . అప్సరసలు ఇంద్రుని సభకు వెళుతూ ఒకరినొకరు పిలుచుకుంటున్నారు!
రంభకు వెళ్లడానికి తీరికే లేదట!
కారణం?వినండి!సంభాషణ రూపంలో పద్యం---
పదవే రంభ సురేంద్రు కొల్వునకు!...అప్పా!నాకు రా తీరదే!
అదియేమే?...ధర మందపాటి రఘునాథాధీశు బాహాసిచే
కదన క్షోణిని నీల్గినట్టి రిపు సంఘాతమ్ము వేవచ్చెడున్
వదిలే దెప్పుడు ?వచ్చుటెప్పుడు?సఖీ వారెందరో చెప్పవే
పదులు న్నూరులు వేలు లక్షలు  గణింపన్ శక్యమే?చెల్లెలా!
          రఘునాథ భూపాలుని కరవాలానికి గురై రణరంగంలో మరణించిన శత్రు సైనికులు లెక్కకు మీరి స్వర్గానికి వస్తున్నారట!
వారిని సుఖాలలో తేల్చవలసి ఉండడం చేత ఇంద్రుని సభకు కూడా పోవడానికి రంభకు వీలు కావడం లేదట!
అవును మరి లక్షల్లో వస్తున్నారాయె!
           కోడూరి శేషఫణి శర్మ

Sunday 25 March 2018

[12/11/2017, 19:59] Kseshaphanisarma: ఏమిటి సుబ్బారావ్!గుడి కొచ్చావ్!ఏం మొక్కుకున్నావ్?

ఏం లేదండి!పోయిన వారం చేసిన పాపాలనన్నిటిని క్షమించేయమని కొబ్బరికాయ కొట్టాను!

అయితే పాపాలు చేయవన్నమాటేగా!

మీరు మరీనూ!వచ్చే వారం చేసే పాపాలను క్షమించ మని అడగడానికి మళ్లీ వస్తానని కూడా మొక్కుకున్నా!

???????
[15/11/2017, 06:33] Kseshaphanisarma: 😆😆😆

దాన ధర్మాలు చేయడంలోనూ పుచ్చుకోవడంలోనూ యిచ్చే వారి చేయి పైన, పుచ్చుకొనేవారి చేయి క్రిందనూ వుంటుంది! కానీ....
          నశ్యం విషయంలో అలాకాదు చూడండి!
ఇచ్చేవారు చిటికెడు నశ్యం వేళ్లు అలా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా పట్టుకుంటే తీసుకొనేవారు పైనుండి చిటికెడు అలవోకగా అందుకుంటారు!
          నశ్యం పండిత లక్షణమట!
          ఒరే అబ్బాయ్! కాస్త నశ్యం యివ్వరా!  అని తండ్రి కొడుకును అడిగే సందర్భాలుంటాయేమో కానీ తక్కిన అలవాట్ల విషయంలో అలా కాదుగా!!!

Saturday 24 March 2018

మహాభారత యుద్ధం--రైతు సందేహం

సరదా కబుర్లు
-------------------
భారత యుద్ధం- రైతు సందేహం!
                 లక్ష్మీ పతి శాస్త్రి పేరు మోసిన పౌరాణికుడు!
అష్టాదశ పురాణాలు ఆయన జిహ్వాగ్రంలోనే వుండేవి! దేనిలో ఏ సందేహం వచ్చినా తీర్చడానికి ఆయనే పెద్ద దిక్కు!
    ఎప్పుడో గ్రామంతరం వెళితే తప్ప ప్రతి దినము రచ్చ బండ మీద పురాణశ్రవణం జరగనిదే గ్రామ ప్రజలకు తోచదు!
                   శ్రోతలకు వచ్చే సందేహాలకు శాస్త్రి గారు అక్కడికక్కడే సమాధానమిచ్చేవారు!
            ఈ క్రమంలో మహా భారతం పురాణం జరుగుతూంది! కథ ఒక్కో పర్వము పూర్తయింది.యుద్ధం అనివార్యం అయింది.పెద్దల మంచి మాటలేవీ పని చేయలేదు!
              కౌరవుల వైపు పదకొండు అక్షౌహిణులు,పాండవుల వైపు ఏడు అక్షౌహిణులు సిద్ధమయ్యాయి!  ......అంటూ చెప్పు కొస్తున్నారు  శాస్త్రి గారు!
        అయ్యా! అక్షౌహిణి అంటే ఏమిటి?.....ఒక రెడ్డి గారికి సందేహం వచ్చింది!
                  శాస్త్రిగారు యిలా వివరించ సాగారు...
            రెడ్డి గారుా! సైన్యంలో చతురంగ బలాలు వుంటాయి!అంటే . రథ గజ తురగ పదాతి దళాలన్న మాట!
           21,870---రథాలు
 . . .  .  21,870---ఏనుగులు
 . . . . . . 65,610--గుర్రాలు
 . . . . . 1,09,350--సైనికులు
కలిస్తే ఒక అక్షౌహిణి అన్న మాట! ఇలాంటివి పదకొండు కౌరవుల వైపు ,ఏడు పాండవుల వైపు తలపడినాయి..అన్న మాట! అన్నారు శాస్త్రి!
             మరో  రైతు లేచాడు!
   ఏమిటి సుబ్బారెడ్డీ? నీసందేహం ఏమిటి?..అడిగారు శాస్త్రి!

         అయ్యా! నాకు కాడెద్దులుా,రెండు బర్రెలుా,ఒక ఆవూ వున్నాయి! వాటిని కట్టేసుకోడానికే స్థలం చాలడం లే.మేపూ చాలడం లే! వాటిని మేపడానికి తోలుకు పోయే పిలగాడూ దొరకడం లేదు!నేను పొలానికి పోతే వాటి ఆలనా పాలనా చూడడానికి మా యింటి దానికి పొద్దు సరిపోవడం లేదు......
              ఇంతకీ ఏమంటావు రెడ్డీ?....అడిగారు శాస్త్రి!
             అదే నయ్యా! రెండు మూడు గొడ్లతోనే మాకింత యాతనగా వుందే!  మీరేమో . అక్షౌహిణీలని వేల రథాలు,వేల గుర్రాలు,వేల ఏనుగులు అంటున్నారు!అన్నింటి కట్టేయడానికి ఎంత స్థలం కావాలె?ఎన్ని గొలుసులు గావాలె? ఎంత మేత గావాలె?
సైనికులకు వండి పెట్టడానికి ఎంత మంది వంటవాళ్లు గావాలె!వండడానికి ఎన్ని బండ్ల వంట చెరుకు గావాలె?ఎన్ని బియ్యం,ఎన్ని కూరగాయలు,ఎన్ని నీళ్లు,ఎన్ని పాత్రలు గావాలె?ఒక్క చోట యిదంతా అయ్యే పనేనా అయ్యా! ...అన్నాడు రెడ్డి!
           అయ్యగారు ఆలోచిస్తున్నారు!
         తన సంసారంతో పోల్చకొని లెక్క కట్టబోయిన రెడ్డికి పెద్ద సందేహమే రాదగిన సందేహమే వచ్చింది కదా!

        -----కోడూరి శేషఫణి శర్మ

Friday 23 March 2018

తాతా ఊతునా!

తెనాలి రామకృష్ణుడు చాటువులు ఎన్నో చెప్పాడు!
ఆయన పైన కూడా చాటువులున్నాయి!
 . .  నంది తిమ్మనకు ముక్కు తిమ్మన అని కూడా పేరుంది!
ముక్కు మీద మంచి పద్యం చెప్పినందుకు ఆ పేరొచ్చిందట!
   సరే!ప్రస్తుతానికి వద్దాం!
 . . ముక్కు తిమ్మన ఇంటి దారిగుండా రామలింగడు వెళుతున్నాడు!
భోజనం చేసి నోటి నిండా తాంబూలంతో వున్నాడు!
తిమ్మన తన యింటి వసారాలో భోజనానంతర విశ్రాంతి తీసుకుంటూ ఊయల మంచం మీద ఉన్నాడు!
           చిలిపి రామలింగడికి ఒక పనికి మాలిన చిలిపి ఊహ వచ్చింది! వెంటనే తిమ్మన దగ్గరకు వెళ్లి '' తాతా! ఊతునా? " అన్నాడు
 . . . . . ఊయల ఊపుతాడేమోనని తిమ్మన " ఊఁ " అన్నాడు.
          వెంటనే రామలింగడు తుపుక్కున ఊశాడు! ఆ తుంపుర్లు తిమ్మన పైన పడ్డాయి!కోపంతో తిమ్మన కాలు ఝాడించాడు! కాలు తగిలి రామలింగని నోటి పల్లు వూడింది!
           మరుసటి దినం రాయల వారు .  . రవి గాననిచో కవిగాంచునే కదా!
అనే సమస్య పూరించమని ఇచ్చారు!
           అప్పుడు ధూర్జటి మహా కవి యిలా పూరించాడు

ఆ రవి వీరభద్రు చరణాహతి డుల్లిన బోసి నోటికిన్
నేరడు!రామలింగ కవి నేరిచెబో మన ముక్కు తిమ్మన
క్రూర పదాహతిన్ తెగిన కొక్కిర పంటికి దుప్పి కొమ్ము ప
ల్గా రచియించినాడు!రవి గాననిచో కవి గాంచునే కదా!

         రామలింగడు బోసినోరు కనపడకుండా దుప్పికొమ్మును అరగదీసి పంటి స్థానంలో అతికించుకొని వచ్చి కూర్చున్నాడట!
అది కనిపెట్టిన ధూర్జటి అలా సమస్య పూరించాడట!
          దక్ష యజ్ఞం ధ్వంసం చేసే సమయంలో వీరభద్రుని దెబ్బకు సూర్యునికి పల్లు వూడిందట!కానీ సూర్యునికి రామలింగనిలా ఉపాయం తోచలేదు! రవి కి తోచని ఉపాయం కవి రామలింగనికి తోచింది!
          ఆ విషయం మరో మహాకవి ధూర్జటికి తెలిసింది మరి!
కథలో నిజమేమో గాని మంచి పద్యం రూపొందింది!