Saturday 3 March 2018

కుడి ఎడమైతే

. .  . .  సరదా కబుర్లు
 . . . . . . . ___________
కవుల కవిత్వమంతా నిజమేనా!ఏమో!
కవులు కల్పన చేయడంలో ఘటికులు!వారి కవిత్వంలో కల్పనలూ వుండవచ్చు!
అతిశయోక్తులూ వుండవచ్చు!
వర్ణనలూ వుండవచ్చు!
అతిశయోక్తులూ వుండవచ్చు!
ఉదాహరణకి......కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! అన్న పాట తెలుసుగా!
నిజ్జంగా కుడి ఎడమైతే పొరబాటు లేదంటారా?
మగవారి సంగతి చూద్దాం!
అద్దం ముందు నిలబడండి!
కుడి వైపుకు దువ్వుకొనేవారు ఎడమ వైపుకి,ఎడమ వైపుకి దువ్వుకొనేవారు కుడి వైపుకి దువ్వుకొని చూడండి! తేడా లేదూ!
 . .  . . మీ చొక్కా జేబు ఎడమ వైపు కాక కుడివైపు కుట్టించుకొని చూడండి!అసౌకర్యం కాదూ!
ప్యాంటుకి వెనక జేబు కుడి వైపు పెట్టించుకొని చూడండి!
చొక్కా గుండీలు కుడివైపు వాటిని పెట్టుకొనే రంధ్రాలు ఎడమకి వుంటాయి!మార్చి చూడండి!
అంతెందుకు!కుడికాలి చెప్పు ఎడమకి, ఎడమకాలి చెప్పు కుడికీ వేసుకోగలరా?
ఆడవారి సంగతీ చూద్దాం!
అకస్మాత్తుగా మీఆవిడ పైట ఎడమ వైపు కాక కుడి వైపు వేసుకొని కనిపిస్తే ఎలావుంటుది? ఆవిడ ముక్కు పుడక కుడి ఎడమలు తారు మారైతే మీకు తేడా తోచదూ!
చీర కుచ్చిళ్లు ఎడమవైపుకి వచ్చేలా కాక కుడి వైపుకి వచ్చేలా దోపిందనుకోండి!ఎలా వుంటుంది?
అంతెందుకు పెళ్లి పీటల మీద వధూవరులకి బుగ్గన చుక్క పెట్టడానికి కూడా పద్ధతుంది కదా!
అమ్మాయిని అబ్బాయికి ఎడమవైపే కూర్చోబెడతారుగా!అందులోనూ బుుగ్వేదులయితే అబ్బాయికి కుడివైపు కూచోబెడతారు! తారుమారైతే పంతులుగారు వూరకుంటారూ?
అంతెత్తున లేవరూ?
కుడి చేత్తో రాసినట్టు ఎడం చేత్తో రాయగలమా!ఎడమ చేతి వాటం గలవాళ్లని కుడి చేత్తో రాయమనండి చూద్దాం .
అసలు కొన్ని పనులు ఎడమ చేత్తోనే చేయాలిగా!కుడి చేతితో చీదగలమా?
 .   ఇప్పుడు చెప్పండి!
కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్ అంటే ఒప్పు కుందామా!
పోనీ లెండి!పాట పాడింది తాగుబోతు కదా!అలాంటి వారికి కుడి ఎడమలు తెలిసి ఏడుస్తాయా అంటారా!
సరే అయితే!
....................కోడూరి శేషఫణి శర్మ

No comments:

Post a Comment