Wednesday 28 March 2018

తంజావూరు రఘునాథ రాయల శౌర్యం---స్వర్గంలో రంభకు యాతన

మందపాటి రఘునాథ మహారాజు శౌర్యాన్ని కొనియాడుతూ కవి చెప్పిన రసవత్తర మైన చాటు పద్యాన్ని చూడండి:
         రణరంగంలో పోరాడి మరణించిన వారికి వీర స్వర్గం దక్కుతందనీ,రంభాది అప్సరసల పరిష్వంగ సుఖాలు అబ్బుతాయనీ వాడుక!
        ఆ మాటను ఊతంగా కవి చమత్కరించాడు చూడండి
 . అప్సరసలు ఇంద్రుని సభకు వెళుతూ ఒకరినొకరు పిలుచుకుంటున్నారు!
రంభకు వెళ్లడానికి తీరికే లేదట!
కారణం?వినండి!సంభాషణ రూపంలో పద్యం---
పదవే రంభ సురేంద్రు కొల్వునకు!...అప్పా!నాకు రా తీరదే!
అదియేమే?...ధర మందపాటి రఘునాథాధీశు బాహాసిచే
కదన క్షోణిని నీల్గినట్టి రిపు సంఘాతమ్ము వేవచ్చెడున్
వదిలే దెప్పుడు ?వచ్చుటెప్పుడు?సఖీ వారెందరో చెప్పవే
పదులు న్నూరులు వేలు లక్షలు  గణింపన్ శక్యమే?చెల్లెలా!
          రఘునాథ భూపాలుని కరవాలానికి గురై రణరంగంలో మరణించిన శత్రు సైనికులు లెక్కకు మీరి స్వర్గానికి వస్తున్నారట!
వారిని సుఖాలలో తేల్చవలసి ఉండడం చేత ఇంద్రుని సభకు కూడా పోవడానికి రంభకు వీలు కావడం లేదట!
అవును మరి లక్షల్లో వస్తున్నారాయె!
           కోడూరి శేషఫణి శర్మ

No comments:

Post a Comment