Thursday 15 March 2018

పెళ్లిళ్లలో అలుకలు -అనునయాలు

సరదా కబుర్లు
---------------------
          పెళ్లిళ్లలో అలుకలు--అనునయాలు
------+----------------------------

            డబ్బుండాలి గానీ యీ కాలంలో పెళ్లిళ్లు చేయడం పెద్ద పనేమీ కాదు! కొండ మీది కోతి నయినా తీసుక వచ్చి డాన్స్ చేయించ వచ్చు!
            రెండు మూడు దశాబ్దాల క్రిందట పరిస్థితి వేరు!కేటరింగ్ సౌకర్యం లేదు.కుర్చీలు బల్లలు యిచ్చే సప్లయర్స్ లేరు!అన్నీ అక్కడా యిక్కడా పురమాయించు కోవలసిందే!
               పల్లెల్లో పెళ్లి అంటే యజ్ఞమే!పాలు,పెరుగు ,పూలహారాలు మొదలు పురోహితుడు,వంటవాళ్ల వరకూ అన్నిమటినీ సమకూర్చుకోవాలి!దేనిలో కాస్త పొరబడినా వచ్చే పెళ్లి వాళ్లతో గొడవే!
         కాలం మారి పట్టించుకోవడం లేదు గానీ పూర్వం ప్రతి విషయానికీ గొడవే!
           ఇప్పుడు చెబితే కాస్త ఎబ్బెట్టుగా వుంటుంది గాని పెళ్లళ్లల్లో అలుకలపై పి హెచ్ డి కి సరిపడా సామాగ్రి దొరుకుతుంది!
            అలుకకి పెద్ద కారణం కూడా అవసరం లేదు!ఏ చిన్న పొరబాటో,మరపో చాలు!
తగాదా మొదలౌతుంది!
             ఒక ఉదాహరణ.....
ఇతర ప్రాంతాల్లో ఏమో గానీ రాయల సీమలో ముఖ్యంగా కర్నూలు జిల్లా లో చింతకాయ పచ్చడికి తోడుగా ఉలవపొడి ని అన్నంలో కలుపుకోవడం అలవాటు! రడీ మేడ్ పచ్చళ్లు దొరికేవి కావు.పెళ్లి కోసం నిమ్మ,మామిడి, గోంగూర పచ్చళ్లు చేసి వుంచేవారు"
            ఒక పెళ్లిలో చింతకాయతో బాటు ఉలవపొడి వడ్డించడం మరిచి పోయారు! ఇంకే ముంది?మగ పెళ్లి వారికి  అవమానం జరిగి పోయింది!మూతులు ముప్పై వంకర్లు తిరిగాయి!సర్ది చెప్పడానికి మధ్యవర్తి తలప్రాణం తోకకి వచ్చింది!
           పెళ్లికి ఆడ వాళ్లు యాభై మంది వచ్చారు! పూలహారం నలభై తొమ్మిది మూరలే విడిదికి పంపారు!వియ్యపురాలికి కోపం రాదా మరి!
        ఎదురుకోలు అనే తతంగం ఒకటి వుంది! వధూ వరులు కాస్త విశేషంగా తయారవుతారు! అమ్మాయి చేతికి స్నేహితురాలెవరో తన రిస్ట్వాచ్ పెట్టింది! పెళ్ళికొడుక్కి అవమానమయింది!అతి శయోక్తి కాదు.దశాబ్దాల వెనక్కి వెళ్ండి!
           పెళ్లివారు వచ్చే వేళకి కరెంటు పోయింది!వర్షం!ఎవరో కాలు జారి పడ్డారు,వియ్యపురాలి వదినగారు అలిగారు!
          ఇలా ఎన్నో! పెళ్లిలో పేకాట రాయుళ్ల బాచ్ పప్రత్యేకం!వారు వున్న చోటికే కాఫీలు,టీలు!లేక పోతే పెళ్లి పెద్దకి మర్యాద తెలియదు!
          ఇలా చాలా వున్నాయి!
కొన్నిసార్లు తమాషాలు కూడా జరుగుతుంటాయి.
             పూలబంతు లాడించడం ఒక సరదా!ఆ సందర్భంలో కాస్త ఉత్సాహవంతురాలైన ఒక పూర్వసువాసిని అమ్మాయి పక్షంలోన నిలబడి అబ్పాయిని...అలా కాదు..ఇలా వెయ్యాలి అంటిటూ ఆట పట్టించింది
అబ్బాయికి చిర్రెత్తుకొచ్చి నీవు కాస్త కూచో!ఇద్దరం ఆడదాం!నేను నేర్చు కున్నాక మేం ఆడతాం!సరేనా అన్నాడు!అంతే ఆవిడ వెళ్లి పోయింది!ఆట సాగింది!
 పూర్వకాలం యిలా ఎన్నో!

--------కోడూరి శేషఫణి శర్మ

1 comment:

  1. ఒక తాతగారు మగపెండ్లివారి తరపున పెండ్లికి వెడుతూ మనవడు కుర్రాణ్ణీ వెంటబెట్టుకొని వెళ్ళారు. రాత్రిపూట భోజనాల్లో ఆవకాయ కూడా వడ్డించారు. పిల్లవాడు ఆవకాయ కలుపుకొని 'నూనె' అని అడిగాడు. అక్కడే ఉన్న ఒకాయన హడావుడిగా వచ్చి 'నేయి' వేసుకో బాబూ అన్నాడు. పిల్లాడు. 'నూనె' కావాలి అన్నాడు. నేయి వడ్డించే ఆయన 'నేయింకా బాగుంటుం' దని నచ్చచెప్ప బోయాడో లేదో తాతగారు కలుగజేసుకొని 'పిల్లాడేమో ఆవకాయలోనికి నూనె కావాలంటుంటే నేయి వేస్తానంటా వేమిటయ్యా నూనె వడ్డించక' అన్నారు. అప్పటికప్పుడు వడ్డించటానికి పప్పునూనె తేవాలంటే ఎలా? నేయి మాత్రం బోలెడు సిధ్ధం చేసారు కానీ ఎవరో నూనె కావలాంటా రనుకోలేదు మరి. ఇంకేముంది! ఆలస్యం. పిల్లవాడి ఎదురుచూపులు - తాతగారి గద్దింపులూ - కొంచెం గడబిడ తరువాత, మొత్తానికి నూనె వడ్దనా అన్నమాట. అన్నట్లు ఆ చిన్నపిల్లాడిని నేనే నండి.

    ReplyDelete