Monday 5 March 2018

మిలిటరీ భోజనం

. . . . . . . సరదా కబుర్లు
 . . . . . . . ____________
   మిలిటరీ భోజనం
________________
                 ఈమధ్య ఎక్కడా కనబడడం లేదు కానీ నా చిన్న తనంలో కర్నూలులో.....మిలిటరీ భోజన శాల . . .  . . అని కొన్ని హోటళ్ల బోర్డులు కనిపించేవి. లోకం తెలియని వయస్సువాడి!
'ఓహో! ఇక్కడ మిలిటరీ వాళ్లు
 భోంచేస్తారేమో ' అనుకొనే వాడిని.తరువాత తెలిసింది మాంసాహార భోజనశాలలకే ఆపేరు పెట్టారని!
                  . . . తిరుపతికి చెందిన మహా పండితులు కీ.శే.గౌరి పెద్ది రామ సుబ్బ శర్మ గారి సమక్షంలో యీ 'మిలిటరీ భోజనం' అనే ప్రస్తావన వచ్చింది!
             'అబ్బాయ్!మిలిటరీ భోజనమంటే మనదిరా!'అన్నారాయన.
 . . . . . . . అదెలాగండీ!పక్కా శాకాహారులం! కాస్తో కూస్తో ఆచార చేలాంచలాలు తిరుగుతున్నాం! మనది మిలిటరీ భోజనమా?' అన్నాను
 . . . . . . . . . వారి వివరణ నామాటల్లో.....
                  మన పంక్తి భోజనాలు చూడండి! మిలిటరీలో కేడర్లు,ర్యాంకుల వారీగా నిలుచున్నట్లు మడి భోజనం చేసేవారు వయసులో పెద్దవారు ఆతరువాతి వారు చివరగా కుర్రకారు పంక్తి దీరి కూర్చుంటారు!విస్తర్లు వేయడం నీళ్ల పాత్రలు అందించిన తరువాత వడ్డన మొదలవుతుంది.ఎలా?
మొదట లవణం తరువాత పచ్చళ్లు పప్పు కూరలు వడియాలు వగైరా . ఎడమ వైపు వేయవలసినవి ఎడమ,కుడివైపు వేయవలసినవి కుడి ప్రక్క  మధ్యలో అన్నం అలా ఎక్కడివక్కడ క్రమం తప్పకుండా వడ్డిస్తారు.వడ్డన పూర్తయిందనడానికి గుర్తుగా ప్రతి విస్తరిలో నెయ్యి అభిఘరిస్తారు!
                 మగవారంతా ఆపోశన తీసు కోవడంతోనూ భగవన్నామ స్మరణతోనూ భోజన కార్యక్రమం మొదలు!
 . . . . . . . . పచ్చడి . పప్పు . చారు . . . . మధ్యమధ్య నంజుళ్లు . . . తీపు . . . మజ్జిగ యిలా ఒక క్రమంలో పదార్థాలు వస్తూంటాయి!
                   ముందుగ తినడం పూర్తయినవారు లేవరు.అందరిదీ అయినంత వరకు భోజన కాలే శ్లోకాలతో అలరిస్తారు!
                 ఉత్తరాపోశన తీసుకున్న తర్వాత అందరూ ఒక్క సారిగా లేస్తారు!
                 వడ్డన మొదలు ముగింపు వరకు ఒకే క్రమం !క్రమ శిక్షణ! మిలిటరీ క్రమ శిక్షణ!
         ఇప్పుడు మిలిటరీ భోజనం ఎవరిది???
               __కోడూరి శేషఫణి శర్మ.

No comments:

Post a Comment