Monday 2 April 2018

హంస-కొంగ

 
       హంస,కొంగ...రెండూ పక్షి జాతికి చెందినవే! అయినా హంస హంసే!కొంగ కొంగే! దేని లక్షణం దానిదే!
       మనుషులూ అంతే కదా! అందరూ మనుషులే అయినా ఎవరి లక్షణం వారిదే!ఎవరి సంస్కారం వారిదే!
         సంస్కారాన్ని బట్టి వారి మాట తీరు,ప్రవర్తన వుంటుంది!ఎదుటి వారి మాట పట్ల స్పందన కూడా అలాగే వుంటుంది!
          కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు యీ విషయాన్ని చాలా అందంగా సున్నితంగా కొంగ-హంసల మధ్య సంభాషణగా పద్య రూపంలో చెప్పారు"
     చూడండి:
          కొంగ అడుగుతూ వుంది....హంస సమాధానం చెబుతూ వుంది

       ఎవ్వడ వీవు?కాళ్లు మొగ మెర్రన!
                                                    హంసమ!...ఎందునుందువో?
      దవ్వున మానసంబునను!  దాన విశేషములేమి చెప్పుమా?
    మవ్వపు కాంచనాబ్జములు, మౌక్తికముల్ కలవందు!....నత్తలో?
    అవ్వి యెరుంగ నన్న నహహా యని నవ్వె బకంబులన్నియున్ !

            హంసను చూచిన కొంగ అడిగింది....నీవెెవరవు?కాళ్లు మొగము ఎర్రగా వున్నాయే?
             హంసను!
            ఎక్కడ వుంటావు?
           చాలా దూరంలో మానస సరోవరంలో...
          అక్కడి విశేషాలేమిటి?
         మృదువైన బంగారు పద్మాలు,ముత్యాలు ఆసరోవరంలో వుంటాయి!
         నత్తలో?(కొంగలకు నత్త గుల్లలు యిష్టమైన ఆహారం)
        అవి నాకు తెలియవు!....అనింది హంస!
     నత్తలు తెలియవా?...అని కొంగలన్నీ పరిహాసంగా నవ్వాయట!

ఎవరి దృష్టి వారిది?కొంగల సంస్కారం అంతే!
వాటికి తెలిసింది నత్తలను తినడమే!అవి తెలియని వారు వాని దృష్టిలో
అమాయకులే! బంగారు కమలాలు ముత్యాల వంటి విలువైన వాని గురించి వాటికి పట్టదు!

              మనుషులు కూడా అంతే!వారి పరిధి లోనే ఆలోచిస్తారు!
అవతలివారి విజ్ఞానము తెలివి తేటల గురించి పట్టించుకోరు!
అవతలి వారి గూర్చి తెలుసుకొనేవాడు,తెలుసుకోవాలనుకొనే వాడు
తెలివిగల వాడిక్రిందకే లెక్క!


   -------కోడూరి శేషఫణి శర్మ

       




Sunday 1 April 2018

వర్ల్డ్ టెలుగు కాన్ఫరెన్స్

సరదాకే సుమా
--------------------
          వర్ ల్డ్ తెలుగు కాన్ఫరెన్స్
------------------------------

ఏమోయ్! నిన్న సాయంకాలం మీ యింటి కొచ్చా!
నీవ లేవు!ఏదో హడావిడిలో వున్నవట!ఏమిటి సంగతి?

ఇన్విటేషన్ వచ్చిందోయ్!

దేనికి?

అదే! వర్ ల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ జరుగుతుందిగా!

అవునా?ఏముంటాయి?

డిస్కషన్సు,పేపర్ ప్రజెంటేషన్సు,రిజల్యూషన్సూ చాల వుంటాయి!

ఎవరెవరు వస్తున్నారు?

ఓపెనింగ్ సెర్మనీకేమో వైస్ ప్రసిడెంటు, వాలిడిక్టరీకేమో ప్రసిడెంటూ వస్తున్నారు!
ఇక పోతే తెలుగు పొయెట్స్,రైటర్స్ చాలామందే వస్తున్నారు!

ఇప్పుడంత అవసరమేమొచ్చిందట?

అదేమిటి?కర్నాటక,టమిల్నాడు స్టేట్స్ చూడు!
వాళ్ల మదర్ టంగ్ కి ఎంత ప్రామినెన్స్ యిస్తారో! మనం కూడా అలా వుండాలోయ్!

ఆ వచ్చేవాళ్ంతా ఏంచెబుతారు!?

మన తెలుగుని ఎలా ప్రమోట్ చేసుకోవాలో, కల్చర్ ని, ట్రెడిషన్స్ ని ఎలా కాపాడుకోవాలో చెబుతారు!

నీవేం చేస్తావట?

డైలీ యూజ్ లో తెలుగు ఇంపార్టెన్సు గురించి పేపర్ ప్రజెంట్ చేస్తున్నా!

అంత పెద్ద సభలు కదా!ఏర్పాట్లు అవీ ఎలా వుంటాయో!

అరేంజ్ మెంట్స్ సూపర్ అనుకో?దీన్లో పార్టిసిపేషన్ లైఫ్ టైం థ్రిల్లింగ్!

క్షమించు! ఒక్క మాట చెప్పనా?

మనలో మనకేమిటి? హెజిటేషన్ లేకుండా చెప్పవోయ్!

ఇందాక పేపర్ ప్రజెంటేషన్! డైలీ యూజ్ అన్నవే!ఇప్పుడు నాతో మాట్లాడిన మాటలన్నీ తెలుగు లోకి మార్చి చెప్పెయ్!
అంతకంటే ప్రత్యేకంగా ఏమీ వద్దు!నిత్యకృత్యంగా ఇప్పుడు చెప్పిన మాటల్ని తెలుగులో మాట్లాడు!మాట్లాడమను!
తెలుగు వర్ధిల్లుతంది!

😚😚😚😚

ఏం? తెలుగును ఎలా నిలబెట్టడమో అర్థం అయిందా?

??????

🙏🙏