Sunday, 11 March 2018

అర్థం చేసుకోరూ!

. . . . . . . . సరదా కబుర్లు।________________________

అర్థం చేసుకోరూ!
_______________
                         రాత్రి వేళ! విద్యుద్దీపాల వెలుతురు!
                       పెళ్లి ఊరేగింపు!అమ్మాయి చక్కగా పట్టు చీరలో తళతళలాడుతూంది!అబ్బాయి సూటు బూటు టై వగైరా హంగులతో బాటు నల్ల కళ్లజోడుతో వున్నాడు!
            పాపం!పుత్తడి బొమ్మకి పుట్టు గుడ్డి దొరికాడేమిటే?....ఆడవాళ్లు బుగ్గలు నొక్కుకుంటున్నారు!
      ఛీ!అదేం కాదు .ఆ వేషానికి నల్లకళ్ల జోడు లేకపోతే ఎలా!
అనుకుంటున్నారు కొందరు!
రాత్రిపూట చలువ కళ్లద్దాలు అనవసరం అని వాడికి తోచలేదు.ఎవరూ చెప్పనూ లేదు.
           చాలా మంది సమయ సందర్భాలు లేకుండా వస్త్రధారణ . అలంకారాలు చేసుకుంటూ వుంటారు!
              పెళ్లి తంతు నడిపే బ్రాహ్మడిని సూటు బూటులో చూడ శక్యమా?మడిలో వరి నాటు వేసే ఆడవాళ్లని జీరాడు కుచ్చిళ్లతో బారెడు పైటతో చూడగలమా!అదేదో పాటలో చెప్పినట్టు "పిక్కలపైదాకా చుక్కల చీర గట్టి...."వుండడంలోనే సుఖమూ సౌఖ్యమూనూ!అరవ కట్టు అడ్డ గుడ్డతో సైకిల్ తొక్కడం కష్టమే కదా!
             పంచె కట్టుటలోన ప్రపంచాన మొనగాడు . కండువా లేనిదే గడప దాటని వాడు....అని తెలుగు వారి ఆహార్యాన్ని సి . నా . రె . ఎంత బాగా చెప్పారో!
                ఒక్కో ప్రాంతంలో ఒక్కో వస్త్రధారణ! వృత్తిని బట్టి . ఆచారాన్ని బట్టి . వాతావరణాన్ని బట్టి ఆహార్యమైనా .  ఆభరణమైనా!
              కాశ్మీరీ లాగా కడప కర్నూలు జిల్లా వాళ్లు రేయింబవళ్లు రగ్గు కప్పు కొని తిరగ గలరా! బంగాళా దుంపలాగా ఉడికి పోరూ!
              దక్షిణాది వేద పండితుల్లా ఉత్తారాది పండాలు కేవలం ఉత్తరీయంతో వుండగలరా!
                 కానీ లోకం పోకడ అలా లేదే!
              ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు వెళ్లే మన రాష్ట్రాల పిల్లల అవస్థ చూడండి!
              డ్రస్సు,టై ,సాక్స్ ,బూట్స్ . . మెళ్లో మూర్ఛ బిళ్లలా వేలాడే ఐ డి కార్డు...అబ్బో!ఒకటా! ఇంకా ఎన్నో.....!
             ఎందుకివీ!అనుకరణ రోగం కాదూ!
                శీతల పాశ్చాత్య దేశాల్లో ఉదయమే పాఠశాలలకి పిల్లలను పంపాలంటే ఈ లంపటం అవసరమే!అక్కడ చలికి,ఆవాతావరణానికి తగ్గట్టు ఒళ్లు,కాళ్లు ,మెడకు ఆ రక్షణ అవసరమే!
                ఉష్ణ దేశంలో మనకెందుకు? 
                అజాగళ స్తనంలా టై ,చెమటతో అసౌకర్యంగా వున్నా కూడా సాక్సు,కాళ్లు ఒరుసుకు పోయేలా బూట్లు....!
              పిల్లల్ని యింతగా యిబ్బంది పెట్టాలా? అదీ చలి కాలమైనా వేసవి కాలమైనా ఒకటేనా? చెమటతో చర్మరోగాల బారిన పడినా పరవాలేదా?
                 ఏ తల్లీ అడగదు!ఏతండ్రీ అడగడు!
                    ఆపాఠ శాల ఉపాధ్యాయ బృందమూ యాజమాన్యమూ అలాంటి  యిబ్బంది కలిగించే దుస్తుల్లో మగ్గు తున్నారా? లేదే!
      పిల్లలకు మాత్రం ఎందుకిీ శిక్ష?
        అర్థం చేసుకోరూ . !!
 
          ____కోడూరి శేషఫణి శర్మ

2 comments:

  1. టపా బాగుంది మేస్టారు .. సింపుల్ గా సూటిగా సుత్తి లేకుండా

    ReplyDelete
  2. ఎంత హంగు ఆర్భాటం ఉంటె అంత గొప్ప చదువులని కదా వీళ్ళ ప్రచారం. దానికితగ్గట్టే పిల్లల చదువుల పట్ల మనకోరికలు. చక్కగా చెప్పారు.

    ReplyDelete